ఏపీలో కొద్ది రోజులుగా అత్యాచార ఘటనలు, హత్యాచార ఘటనలు జరుగుతున్న వైనం కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే మహిళలపై రెచ్చిపోతున్న కామాంధులకు ఏపీ సీఎం చంద్రబాబు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. చిన్నారులు, మహిళలను రేప్ చేసే కిరాతలకులను నడిరోడ్డుపై ఉరి తీయాలని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా వడమాలపేట లో మూడేళ్ల చిన్నారి హత్యాచారం ఘటనపై చంద్రబాబు స్పందించారు. ఈ ఘటన కలిచివేసిందని, చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు, అధికారులకు ఆదేశించారు.
ఇద్దరు, ముగ్గురు నిందితులను నడిరోడ్డుపై ఉరి తీస్తేనే కామాంధులు దారికి వస్తారని, ఆడపిల్ల జోలికి వస్తే అదే చివరి రోజు అని కామాంధులను హెచ్చరించారు. బాధిత బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు.
ఉచిత ఇసుక, మద్యం వ్యాపారంలో అక్రమాలకు పాల్పడితే సహించబోనని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మద్యం రేట్లు పెంచితే ఊరుకోబోనని, బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తా అని హెచ్చరించారు. ఏపీ ఎస్కోబార్ జగన్ రాష్ట్రంలోని రోడ్ల నిండా గుంతలు వదిలి వెళ్లారని, సంక్రాంతి లోపు రోడ్లపై గుంతలు పూడుస్తామని చెప్పారు. ఆ తర్వాత కొత్త రోడ్లు అవసరమైన చోట వేస్తామని తెలిపారు.