ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ పాలన సాగిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తు పనులను షురూ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదగా అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు.
రోడ్లు అనేది నాగరికతకు చిహ్నం. రోడ్లు మంచిగా ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. సమయానికి గమ్యం చేరుకుంటాము. కానీ గత ఐదేళ్లలో గుంతలు తవ్వారు, గోతులు పెట్టారు. రోడ్లను ప్రమాదకరంగా మార్చారని చంద్రబాబు మండిపడ్డారు. రోడ్ల మరమ్మతుల పేరుతో రూ.వెయ్యి కోట్లు నొక్కారు. చివరకు రాష్ట్రానికే గోతులు తవ్వి వెళ్ళాడంటూ జగన్ పై బాబు చురకలు వేశారు.
రహదారులను నరకానికి మార్గాలుగా మార్చారు. అటువంటి రోడ్లని ఇప్పుడు మేము బాగు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో గుంతలు పూడ్చడానికి రూ.860 కోట్లు ఖర్చు పెడుతున్నామని పేర్కొన్నారు. గుంతలు లేని రోడ్లే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంక్రాంతిలోపు రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండకూడదని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రౌడీ రాజకీయాలు వద్దు. అభివృద్ధి రాజకీయాలే మనకు కావాలన్నారు.