ఓటు అనే ఆయుధంతో ప్రజలు అధికారాన్ని పోగొట్టినా వైసీపీ నేతలకు అహంకారం మాత్రం తగ్గడం లేదు. తాజాగా గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. తమ ఇంటి ముందు దీపావళి టపాసులు పడ్డాయనే కారణంతో ఓ దళిత కుటుంబంపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా శకుంతలనగర్ లో దళిత వర్గానికి చెందిన సోని, తన కుమారుడు అవినాష్ ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. వీరి ఇంటికి ఎదురుగా వైసీపీ నేత కంకర నరేంద్రరెడ్డి సోదరుడు నివసిస్తున్నాడు.
దీపావళి పండుగ సందర్భంగా అవినాష్ అపార్టుమెంటు ముందు ఫ్రెండ్స్ తో కలిసి టపాసులు కాల్చాడు. అవి ఎగిరి వైకాపా నేత ఇంటి ముందు పడ్డాయి. దాంతో సదరు నేత అవినాష్ తో గొడవకు దిగాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. అవినాష్ ఎదురు తిరగడంతో.. తన సోదరుడు నరేంద్రరెడ్డి మరియు ఇతర అనుచరులను రప్పించి అతని పై దాడికి తెగబడ్డారు. గాయాలతో అవినాష్ ఇంట్లోకి వెళ్లిపోయినా.. అతన్ని వదిలిపెట్టలేదు.
అపార్టుమెంట్ లోపలికి వెళ్లి మరీ అవినాష్ మరియు అతని తల్లి సోనిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఇంట్లోని సామగ్రి ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని అవినాష్ జనసేన నేతలకు తెలియజేసి సాయాన్ని కోరగా.. వారు నల్లపాడు పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకుని అవినాష్ మరియు అతని తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లబోయారు. అయితే వైసీపీ మూక పోలీసుల సమక్షంలోనే జనసేన నేతలపై కూడా దాడికి పాల్పడ్డారు.
బాధితులు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వైసీపీ నేత కంకర నరేంద్రరెడ్డి, అతని సోదరుడు మరియు అనుచరులపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కానీ ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. మరోవైపు ప్రాణభయంతో అవినాష్, సోని బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. సదరు వైసీపీ నేతలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.