వైసీపీ నేత, మాజీ మంత్రి..అలియాస్ బూతుల మంత్రి అని సోషల్ మీడియాలో నెటిజన్లు పిలుచుకునే కొడాలి నాని..జగన్ హయాంలో నోటికి వచ్చినట్లు మాట్లాడిన వైనంపై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ లపై నాని పరుష పదజాలంతో విమర్శలు గుప్పించడంపై టీడీపీ నేతలు మండిపడ్దారు. ఈ క్రమంలోనే తప్పు చేసిన వారి పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని లోకేష్ గతంలోనే హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ తాజాగా కొడాలి నాని కోసం రెడ్ బుక్ లో చాప్టర్ 3 ఓపెన చేయబోతున్నానని పరోక్షంగా సంచలన ప్రకటన చేశారు.
ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న లోకేష్…‘ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్-2024’ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆ తర్వాత అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంట ఏర్పాటు చేసిన 14 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రెడ్ బుక్ లో చాప్టర్ 3 గురించి లోకేష్ మాట్లాడారు. 2 చాప్టర్లు మొదలయ్యాయని, మూడో చాప్టర్ మొదలుబెట్టాలంటే వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు చాలా కష్టపడాలని లోకేష్ అన్నారు. అంతే, పరోక్షంగా కొడాలి నాని, వల్లభనేని వంశీలు టార్గెట్ గా రెడ్ బుక్ చాప్టర్ 3 ఉండబోతోందని లోకేష్ చేసి కామెంట్లు వైరల్ గా మారాయి. గత ప్రభుత్వం అండ చూసుకొని చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సినిమా చూపిస్తానని, ఆ విషయంలో తగ్గేదేలేదని లోకేష్ హెచ్చరించారు. రెడ్ బుక్ కు భయపడి గుడ్ బుక్ తెస్తానన్న జగన్…ఆఖరికి నోట్ బుక్ లో ఏమీ రాయలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఎన్నారైలు కాదని ఎమ్మారైలు అని, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ ‘ఎంఆర్ఐ’ అని లోకేష్ ప్రశంసించారు.