ఏపీలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టెస్లా, అమెజాన్ వెబ్ సర్వీసెస్, బోసన్ వంటి కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు లోకేష్. అంతే కాకుండా, లాస్ వేగాస్ లో జరిగిన ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ 2024లో పాల్గొని పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయి ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాలని, అందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వారికి వివరించారు.
ఈ క్రమంలోనే అమెరికాలో తాజాగా సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లా ప్రగడ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేశ్ రాగినేనితో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, ఏపీలో కంపెనీ పెట్టేందుకు గల అవకాశాలు బాగున్నాయని వారికి వివరించారు. ఈ-గవర్నెన్స్, పబ్లిక్ సెక్టార్ లలో ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలను ఏపీలో సమర్థవంతంగా వినియోగించాలనుకుంటున్నామని, సీఆర్ఎం సొల్యూషన్లు, ఏఐ-డ్రైవెన్ పబ్లిక్ సర్వీసెస్, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అమలుకు సేల్స్ఫోర్స్ సహకారం కావాలని లోకేష్ కోరారు. డేటా సేవల రంగానికి అనువైన వాతావరణం విశాఖలో ఉందని, ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సేల్స్ ఫోర్స్ ఉన్నతాధికారులు తెలిపారు. సేల్స్ ఫోర్స్ కు సంబంధించిన కస్టమర్ 360, ఐన్ స్టీన్ ఏఐ వంటి ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని చెప్పారు. క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ కంప్యూటింగ్, అప్ డేటేడ్ అప్లికేషన్లలో సేల్స్ ఫోర్స్ పురోభివృద్ధి సాధిస్తోందన్నారు.