ఏపీ మాజీ సీఎం జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ల మధ్య ఆస్తి వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిలపై వైసీసీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ సొంతగా సంపాదించుకున్న ఆస్తిలో షర్మిలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, వైఎస్సార్ బతికి ఉన్నపుడు ఆస్తుల పంపకం జరగలేదని, ఇద్దరు పిల్లలకు సమానంగా ఆస్తి ఇవ్వాలన్నదే వైఎస్ఆర్ కోరిక అని విజయమ్మ చెప్పడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది.
ఈ క్రమంలోనే తాజాగా షర్మిలకు భద్రత పెంచాలని ఏపీ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమరావుకు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇచ్చారు. షర్మిలకు ప్రస్తుతం 2+2 భద్రత కొనసాగుతోందని, దానిని 4+4కు పెంచాలని వారు కోరారు. తెలంగాణలో షర్మిలకు వై కేటగిరీ భద్రత ఉందని, ఏపీలో దానిని కొనసాగించాలని కాంగ్రెస్ నేతలు ఆ లేఖలో కోరారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె అనేక కార్యక్రామాలు, బహిరంగ సభలకు హాజరవుతుంటారని, ప్రజాక్షేత్రంలో ఉన్న షర్మిలకు తగిన భద్రత కల్పించాలని వారు కోరారు. మరి, కాంగ్రెస్ నేతల విజ్ఞప్తిపై ఏపీ డీజీపీ స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.