ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడి పారిశ్రామికవేత్తలతో లోకేష్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైతే సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామని కూడా లోకేష్ ప్రకటించారు. ఈ క్రమంలోనే మరో దిగ్గజ కంపెనీ ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. ఆస్టిన్ లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన లోకేష్…ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో చర్చించారు.
విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంతో 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేష్ అన్నారు. టెస్లా వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల సహాయ, సహకారాలు అందుకు అవసరమని అన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని, కియా, హీరో మోటార్స్ వంటి కంపెనీలను రాష్ట్రానికి రప్పించారని వెల్లడించారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాలపై బాబు దృష్టిసారించారని అన్నారు.
టెస్లా ఈవీ తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా అనంతపురం బాగుంటుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోలార్ ఎనర్జీ వ్యవస్థలు, ముఖ్యంగా స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణకు సౌర ఫలకాలను అమర్చడంలో టెస్లా భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. టెస్లా ఏపీకి వస్తే గ్రీన్ ఎనర్జీ, ఈవీ రంగంలో కీలకపాత్ర వహించే అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ను అభివృద్ధి చేయడం, సూపర్చార్జింగ్ టెక్నాలజీ అమలులో భాగస్వామ్యం కావాలని టెస్లాను కోరారు. ఏపీలో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేయాలని కోరారు.