కోడికత్తి దాడి ఒక బూటకం.. చిన్నాన్న హత్యపై నాటకం.. లేని పింక్ డైమండ్ ఉన్నట్లు కపటం.. అన్నింటికీ మించిన పేద్ద అబద్ధం 35 మంది కమ్మ సామాజిక వర్గం సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్లు.. ఇవి కాకుండా 2014-19 నడుమ జగన్ ప్రతి రోజూ చెప్పిన అబద్ధం రాష్ట్రానికి ప్రత్యేక హోదా.. వీటికి అదనంగా నాటి సీఎం చంద్రబాబు రూ.6 లక్షల కోట్ల అవినీతి చేశాడంటూ ఒక పుస్తకం.. ఇలా అబద్ధపు పునాదుల మీదే 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు.
పజల మనసులను కలుషితం చేసి.. అనుమానపు బీజాలు నాటి.. అంతిమంగా రాజకీయ లబ్ధి పొందడమే లక్ష్యం. ఈ అబద్ధాలపై అధికారంలోకి రాగానే జగన్ ముఠా మొత్తం గప్‌చుప్. అవి అబద్ధాలు కనుకే జగన్‌కు జనం రెండోసారి అధికారం ఇవ్వలేదు. ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైనా ఆయన నోటి వెంట నిజాలు రావడం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే ఢిల్లీ వెళ్లిన జగన్ దేశ రాజధానిలో మాట్లాడుతూ… రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన వారిని వేటాడుతున్నారని, ఈ కొద్ది రోజుల్లోనే 36 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు.
దీనిపై అక్కడున్న జాతీయ మీడియా ఆ హత్యల వివరాలు, హతుల పేర్లు అడిగితే అక్కడి నుంచి ఆయన జారుకున్నారు. వినుకొండలో వైసీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు రషీద్, జిలానీ పరస్పర ద్వేషాలతో కొట్టుకుని రషీద్ చనిపోతే.. టీడీపీ ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని మండిపడ్డారు. వ్యక్తిగత కక్షల వల్లే హత్య జరిగిందని రషీద్ కుటుంబ సభ్యులే చెబితే.. వారి చేతిలో డబ్బు పెట్టి ఆ తర్వాత టీడీపీ నేతలు చంపించారని చెప్పించారు. ఆ రోజు కూడా మీడియా ముందు 36 హత్యల ప్రస్తావన తెచ్చారు. వివరాలడిగితే ఎదురుదాడికి దిగారు. అసలు తానెందుకు వచ్చానో కూడా తెలియని స్థితిలోకి వెళ్లారు.
పరామర్శలకు వెళ్లి.. చంద్రబాబు ప్రభుత్వంపై కొద్దిరోజుల్లోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని.. తాను లేకపోవడంతో అమ్మఒడి, రైతు భరోసా రావడం లేదని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. విజయవాడలో వరద బాధితులకు చంద్రబాబు దగ్గరుండి మరీ సాయం అందిస్తుంటే.. అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శించకపోగా.. ఒక్క అధికారి కూడా వారి గోడు వినిపించుకోవడం లేదని చెప్పారు. తమకు సాయం అందుతోందని బాధిత మహిళలు చెప్పడంతో వెనుదిరిగి.. కొంతదూరంలో మీడియాతో మాట్లాడుతూ అవే విమర్శలు చేశారు. తాను చెబుతున్నది అబద్ధమన్న విషయాన్ని జనం గ్రహించారని.. తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయనకు తెలుసో.. తెలిసినా నటిస్తున్నారో అర్థం కావడం లేదు.
అబద్ధాలను నమ్మించడమే వ్యూహం..
2014 నుంచి 2024 వరకు జగన్ అబద్ధాలనే నమ్ముకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే వ్యూహం. ఈ అబద్ధాల వ్యూహాన్ని కూటమి ప్రభుత్వం సరిగ్గా ఎదుర్కోలేకపోతోందని, కఠినంగా వ్యవహరించలేపోతోందని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 36 రాజకీయ హత్యలపై జగన్ సైలెంటయినా వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం ఆగడం లేదు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుండడం కళ్ల ముందు కనబడుతుంటే.. ఏవీ అమలు చేయడం లేదని.. ఇసుక ఉచితం కాదని, అధిక ధరలకు అమ్ముతున్నారని.. కమ్మ సామాజిక వర్గం వారికి పోస్టింగుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారంటూ గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టారు.
వీటిపై ప్రతి రోజూ వైసీపీ నుంచి ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయకపోతే పార్టీకి నష్టం తప్పదని, జగన్ తీరుపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ గోబెల్స్ భూతం మరింత భయంకరంగా మారే ప్రమాదం ఉందని టీడీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. అటు క్షేత్ర స్థాయి వైసీపీ శ్రేణులకూ ఆయన తీరు ఇబ్బంది కలిగిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఈ అబద్ధాలే తమను నిండా ముంచాయని, ఇకపై జగన్ నిజాలు చెప్పినా ఎవ్వరూ నమ్మరేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నోట్లో నుంచి ఒక విమర్శ వచ్చిందంటే అది 100 శాతం నిజమై ఉండాలని.. అసత్యాలతో పార్టీపై ప్రజల్లో అసహ్యం పెరుగుతుందని.. వీటిని కొనసాగిస్తే పార్టీ కనుమరుగైపోయే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడూ అధికారంపై యావే!
అధికారం దూరం కావడం జగన్ భరించలేకపోతున్నారనడానికి ఆయన మాటలే నిదర్శనం. ప్రజాతీర్పును గౌరవించడం ఆయనకు చేతకాదు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక.. మీడియా ముందుకొచ్చి.. చంద్రబాబు తప్పుడు హామీలతో గద్దెనెక్కారని.. అవన్నీ అమలు చేయలేక.. ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని.. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పారు. తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. ఇంత తక్కువ కాలంలో ప్రజాభిమానం కోల్పోయిన సర్కారును తాను చూడలేదని.. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు గడచిపోతాయని.. 2029 ఎన్నికల్లో గెలుపు మనదేనని అన్నారు.
అసెంబ్లీ, శాసనమండలిలో పార్టీ తరఫున ఎలా వ్యవహరించాలో చెబుతారని తాము వస్తే.. ఐదేళ్ల తర్వాతి విషయాలు మాట్లాడతారేమిటని వారు విస్తుపోయారు. అయితే ఈ అధికార లాలస ఆయనకు కొత్త కాదు. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే… మృతదేహం ఇంటికిరాకముందే తనను సీఎం చేయాలంటూ ఎమ్మెల్యేలతో సంతకాలు చేయుంచినప్పుడే ఆయన అధికార వ్యామోహం ఎలాంటిదో తేలింది. కాంగ్రెస్ అధిష్ఠానం పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వజూపితే అక్కర్లేదని చెప్పి.. తండ్రి మరణాన్ని సానుభూతిగా మలచుకుని సొంత పార్టీ పెట్టి అధికారంలోకి రావాలని అప్పట్లో ప్రయత్నించారు. ఓదార్పు యాత్ర వద్దన్నారని సాకుగా చూపి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ పెట్టారు. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి.. రాష్ట్ర విభజనకు అంగీకరించి సోనియాగాంధీతో ఒప్పందం చేసుకుని బెయిల్ పొందిన మాట వాస్తవం కాదా?
కక్షల కేసులపై ఏడుపు!
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం తనకు ఉన్న అధికారాలతో ప్రతిపక్ష నాయకులపై, సామాన్యులపై ఎడాపెడా దొంగకేసులు పెట్టింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని సమీక్షిస్తుందనగానే, జగన్ రోతపత్రిక ఉలిక్కిపడుతోంది. భుజాలు తడుముకుంటోంది. గత ఐదేళ్లపాటు జగన్ పెట్టిన దొంగ కేసుల గుట్టు రట్టవుతుందని భయమా? ఆ కేసులన్నీ నిజమే అనుకుని నమ్మి ఓట్లేసి 11 సీట్లు ఇచ్చిన ఓటర్లు కూడా దూరం అవుతారని కంగారా? కేసులను సమీక్షల పేరుతో చంద్రబాబు నీరుగార్చుతున్నారంటూ గురువారం రోతపత్రికలో ఒక ఏడుపుగొట్టు కథనం ప్రచురించారు. జగన్ పెట్టిన కేసులన్నీ తప్పులనడానికి ప్రజలముందే సాక్ష్యాలున్నాయి. అవినీతి అంటూ పెట్టిన కేసుల్లో ఒక్క రూపాయిని కూడా చూపించలేకపోయారు. ఇలాంటి నియంతృత్వ పోకడలతోనే జనాలు కూడా విసుగెత్తిపోయి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు.
అయ్యో.. జనాలకు తెలిసిపోతే ఎలా?
పోలీసులను అడ్డగోలుగా ఉపయోగించుకుని అక్రమ కేసులు పెట్టడానికి జగన్‌కి ఏ అధికారాలైతే ఉన్నాయో.. వాటిని సమీక్షించి తప్పొప్పులు తేల్చడానికి కూడా కూటమి ప్రభుత్వానికి అవే అధికారాలుంటాయి. తప్పుడు కేసుల లోగుట్టు బయటపడితే అందుకోసం వారు చేసిన ఘోరాలు వెలుగులోకి తెస్తే అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో చేశారో ప్రజలకు మరింత స్పష్టత వస్తుంది. ఇదే జగన్‌ను, ఆ రోతపత్రికను వేధిస్తున్న అంశం. జగన్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయి. నోరు తెరిస్తే కేసు, భారతి అని వినిపిస్తే కేసు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసు, అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తితే కేసు, వారు ఆశించింది దక్కకపోయినా కేసు, ఆఖరికి ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు..ఇవన్నీ నేరాలు జరగడం వల్ల నమోదైన కేసులు కాదు.
కేవలం ప్రజలను, నాయకులను భయభ్రాంతులకు గురి చేసి తమ రాక్షస పాలనను ఎవ్వరూ ప్రశ్నించకుండా చేయడం కోసం వైసీపీ నాడు అవలంబించిన దుర్మార్గమైన విధానం. జగన్ హయాంలో 3,000కు పైగా ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టారు. 2,560 మందికి పైగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. టీడీపీలో కాస్త నోరున్న నాయకులను అక్రమ కేసులతో సతమతం చేశారు. గతంలో చంద్రబాబుపై ఒక్క బాబ్లీ కేసు మాత్రమే ఉండేది. జగన్ హయాంలో 17 కేసులు పెట్టారు. పవన్ కల్యాణ్‌పై 7 కేసులు పెట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 66 కేసులు పెట్టారు.
సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయని ధూళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టారు. పులివెందులలో పోటీ చేసిన బీటెక్ రవిని ఏ కారణం చెప్పకుండా జైల్లో పెట్టారు. అధికారులపై దాడి చేశారంటూ కూన రవికుమార్‌పై కేసులు నమోదు చేశారు. ఫర్నిచర్ దుర్వినియోగం చేశారంటూ మాజీ స్పీకరు కోడెల శివప్రసాదరావుపై 18 కేసులు పెట్టారు. ఆ అవమానం తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుత హోం మంత్రి, టీడీపీలోని ఎస్సీ నాయకురాలు వంగలపూడి అనితపై అప్పట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఇప్పటి స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై అప్పట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు అత్యాచారయత్నం కేసు పెట్టారు.
ఆరోగ్యం బాగాలేని అచ్చెన్నను కేసులు పెట్టి 600 కిలోమీటర్లు వాహనాల్లో తిప్పారు. ప్రఽశ్నపత్రం లీకైందని ఇప్పటి మంత్రి నారాయణపై ఆనాడు కేసు నమోదు చేశారు. చింతమనేని ప్రభాకర్‌పై 48 కేసులు, పులివర్తి నానిపై 31 కేసులు, దేవినేని ఉమాపై 27, ఆఖరికి సొంత చెల్లి షర్మిలపై కూడా కేసులు పెట్టారు. అప్పటి సొంత ఎంపీ రఘురామకృష్ణరాజును లాకప్‌లో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఐదేళ్ల పాటు సొంత నియోజకవర్గంలోకి రాలేని భయానక వాతావరణం సృష్టించారు.
జై జగన్ అనలేదని పల్నాడులో టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్యను ఘోరంగా చంపేశారు. సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపడితే 4,000 మందిపై అక్రమంగా కేసులు పెట్టారు. ఆఖరికి ఫోన్లో వార్తలు ఫార్వర్డ్ చేసిన జర్నలిస్టులపై కూడా కేసులు పెట్టారు. జగన్ ప్రభుత్వం అమరావతిలోని రైతులను, మహిళలను కనీసం మనుషులుగా కూడా చూడలేదు. కేసులు, అరెస్టులు, సోషల్ మీడియాలో బూతులతో వారిని చిత్రహింసలు పెట్టారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిందంటూ అరవైయేళ్ల పెద్దావిడ పైకి కూడా సీఐడీని ఉసిగొల్పారు.
ప్రజలు నోరెత్తాలంటే భయపడాలన్న నియంతృత్వ పోకడలతో జగన్ పెట్టిన అక్రమ కేసులను వీరంతా ఎందుకు భరించాలి? ప్రభుత్వం మారాకైనా ఉపశమనం కలగాలి కదా! అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్లలో జగన్ పెట్టిన కేసులను సమీక్షించి అక్రమ కేసుల నుంచి బాధితులకు ఉపశమనం కలిగించేందుకు పూనుకున్నారు. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేశారు. బాబు అరెస్టు జరిగిన తర్వాత 8 నెలల పాటు వైసీపీనే అధికారంలో ఉంది. కానీ ఒక్క ఆధారం కూడా చూపలేదు. అలాంటప్పుడు ఆ కేసు కక్షపూరితం, అక్రమమే అవుతుంది. ఇలాంటి వాటిని ఎందుకు భరించాలి? అందుకే కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.
జగన్ అబద్ధాల్లో మచ్చుకు కొన్ని..
ఫ చంద్రబాబు హయాంలో 35 మంది కమ్మసామాజికవర్గం సీఐలకు డీఎస్పీలకు ప్రమోషన్లు ఇచ్చారనడం
ఫ టీటీడీలో ఉన్న పింక్ డైమండ్‌ను చంద్రబాబు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారనడం.
ఫ విశాఖ విమానాశ్రయంలో తాను చేయించుకున్న కోడికత్తి దాడిని టీడీపీపైకి నెట్టడం.
ఫ సొంత బాబాయి హత్యకు గురైతే చంద్రబాబే చంపించారంటూ విపరీతమైన ప్రచారం
ఫ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని 2019కి ముందు జగన్ ప్రతిరోజూ చెప్పిన అబద్ధం.
ఫ ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్రంలో ఒకలా మాట్లాడి పార్లమెంటులో అందుకు విరుద్ధంగా బిల్లుపెట్టిన బీజేపీకి మద్దతివ్వడం.
ఫ విశాఖలో పెట్టుబడుల సదస్సు పెట్టి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ఖరీదైన అబద్ధం.
ఫ సంపూర్ణ మద్యపాన నిషేధమని హామీ ఇచ్చి అటకెక్కించిన వైనం. మద్యం వ్యాపారాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లకుపైగా అప్పు తేవడం. పైగా మద్యం వినియోగం తగ్గిందంటూ అసెంబ్లీలో అసత్యపు ప్రకటన.
ఫ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం అసెంబ్లీ వేదికగా 3 రాజధానుల ప్రకటన
ఫ వారం రోజుల్లో సీపీఎస్ రద్దంటూ ఉద్యోగులను మోసం చేయడం.