రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది విదితమే. అంతేకాకుండా, ఒకసారి తీసుకున్న నిర్ణయం సరిగ్గా అలాంటిదే మరోసారి తప్పుగా కనిపిస్తుంది లేదా విమర్శలకు అవకాశంగా మారుతుంది. అది ప్రజాపయోగమైనదైనా లేదా పరిపాలన సంబంధమైనదైనా లేదంటే రాజకీయపరమైన అంశమైనా కావచ్చు. తాజాగా ఇలాంటి స్థితినే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుర్కునే చాన్స్ ఉందని అంటున్నారు. తెలంగాణలో ఫిలిం స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్న నందమూరి బాలకృష్ణ నిర్ణయం, ఈ విషయంలో ప్రభుత్వపరంగా పడుతున్న అడుగులు దీనికి కారణం.
మీడియా, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం హైదరాబాద్లో ఫిలిం స్టూడియో నిర్మించే ఆలోచనలో నందమూరి బాలకృష్ణ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం తన తండ్రి ఎన్టీఆర్కు ఇష్టమైన స్టూడియో అంశం. దివంగత ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోను ప్రస్తుత ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో నిర్మించగా తమిళ లెజెండ్ ఎంజీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. అయితే, ఆ స్టూడియోను మరింత విస్తరించాలని ఎన్టీఆర్ ఆలోచించగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వాణిజ్య కేంద్రంగా మారడం, విస్తరణకు భూమి అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. దీంతో రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియో పేరుతో నాచారంలో మరో పెద్ద స్టూడియోను ఎన్టీఆర్ నిర్మించారు. అయితే, ఈ రెండు స్టూడియోలు ప్రస్తుత సినీ నిర్మాణ అవసరాలకు తగినట్లుగా లేకపోవడంతో మరో కొత్త స్టూడియో నిర్మించేందుకు బాలకృష్ణ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఈ మేరకు బాలకృష్ణ తన ఆసక్తి, ప్రతిపాదనలు సైతం ప్రభుత్వానికి అందించినట్లు సమాచారం. రెవెన్యూ శాఖ తనకు అందిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయడం, ఈ మేరకు ఫైలు ప్రధాన కార్యదర్శికి పంపించడం జరిగినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ సినీ స్టూడియోకు భూ కేటాయింపులపై సీఎస్ నుంచి వచ్చిన ప్రతిపాదనలు నేడు జరగబోయే కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందంటున్నారు.