వైసీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్…తన సోదరి వైయస్ షర్మిలపై ఆస్తి వ్యవహారం నేపథ్యంలో వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవడం చేతకాని వ్యక్తి జగన్ అని, అటువంటి వ్యక్తి రాష్ట్రానికి పెద్దలాగా ఏం చేస్తాడని ఆయన నిలదీశారు. కుటుంబానికి ఏం న్యాయం చేశాడో ముందు జగన్ చెప్పాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు.
ఇక తిరుమలలో పర్యటించిన సందర్భంగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విమానాల్లో బాంబు బెదిరింపు ఫేక్ కాల్స్ పై రామ్మోహన్ నాయుడు స్పందించారు. తొమ్మిది రోజులుగా ఇటువంటి ఫేక్ కాల్స్ పెరుగుతున్నాయని, వాటిని చాలా సీరియస్ గా తీసుకొని విచారణ జరుపుతున్నామని అన్నారు. ముంబైలో ఓ మైనర్ బాలుడిని ఫేక్ కాల్ చేసినట్లుగా గుర్తించి పట్టుకున్నారని, అతడి స్నేహితుడిపై కోపంతో అతను అలా చేశాడని విచారణలో తేలిందని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
ఫేక్ కాల్స్ విషయంలో ఏవియేషన్ శాఖ, హోం శాఖ కలిసికట్టుగా ప్రయత్నిస్తున్నాయని, త్వరలోనే ఇటువంటి వాటికి ముగింపు పలుకుతామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇటువంటి బెదిరింపు కాల్స్ చేసే వారికి, సోషల్ మీడియాలో బెదిరింపు పోస్టులు పెట్టే వారికి జైలు శిక్ష విధించేలా చట్టపరమైన మార్పులు తీసుకొస్తామని అన్నారు. అటువంటి వారు జీవితంలో విమాన ప్రయాణం చేయకుండా నిషేధం విధించేలా చట్టం రూపొందిస్తున్నామని అన్నారు.