తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడిన కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్లను 4000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ లోని పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది.
ఈ క్రమంలోనే ఈ నెల 29వ తారీకు నుంచి గ్యాస్ బుక్ చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా ప్రకటించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందేందుకు సంబంధించిన మార్గదర్శకాలను, విధివిధానాలను నాదెండ్ల వెల్లడించారు. అక్టోబర్ 31వ తేదీన సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని నాదెండ్ల చెప్పారు ఎల్పీజీ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు అని చెప్పారు. అర్హులందరికీ ఈ పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందిస్తామని అన్నారు.
ఈ పథకం అమలు చేయడం వల్ల ప్రతి ఏటా ప్రభుత్వంపై 2700 కోట్ల రూపాయల భారం పడబోతుందన్నారు. తొలి విడతగా దాదాపు 900 కోట్ల రూపాయలను ఎల్పీజీ కంపెనీలకు మరికొద్ది రోజుల్లో అడ్వాన్స్ గా ఇవ్వబోతున్నామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ బుక్ చేసిన 24 గంటల్లోపు, గ్రామీణ ప్రాంతాలలో 48 గంటల్లోపు గ్యాస్ డెలివరీ అవుతుందని చెప్పారు.
సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల లోపే డిబిటి ద్వారా లబ్ధిదారుల ఖాతాలో సిలిండర్ ఖరీదు చేసిన మొత్తం జమ చేస్తామని చెప్పారు. ఈ పథకం అమలు కోసం ఏడాదికి మూడు బ్లాక్ పీరియడ్లను కేటాయించామన్నారు. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు మొదటి బ్లాక్ పీరియడ్, ఆగస్టు ఒకటి నుంచి నవంబర్ 31 వరకు రెండోది, డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు మూడో బ్లాక్ పీరియడ్ గా పరిగణిస్తామన్నారు. మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండో సిలిండర్ జూలై 31 లోపు, మూడో సిలిండర్ నవంబర్ 30లోపు ఎప్పుడైనా పొందవచ్చని నాదెండ్ల వెల్లడించారు.