ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలల మధ్య ఆస్తి వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. ఈ వ్యవహారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు ఆధారాలను చూపిస్తూ వస్తున్నారు. జగన్ తన సొంత ఆస్తిలో వాటాను షర్మిలకు ఇచ్చారని, అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తి కాదని, వారసత్వంగా షర్మిలకు సంక్రమించే అవకాశం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. ఆస్తి వ్యవహారంపై వైఎస్ఆర్ అభిమానులకు షర్మిల మూడు పేజీల బహిరంగ లేఖ రాస్తూ అందులో సంచలన విషయాలు వెల్లడించారు.
వైఎస్సార్ అభిమానులకు వాస్తవాలు తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ లేఖ రాస్తున్నానని షర్మిల చెప్పారు. తన తండ్రి వైఎస్సార్ తనను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదని, ఆస్తిలో సమాన వాటా ఉండాలని చెప్పేవారని షర్మిల వెల్లడించారు, వైఎస్ఆర్ ఉన్నప్పుడు స్థాపించిన వ్యాపారాలన్నీ కుటుంబ వ్యాపారాలని, అవి జగన్ సొంతం కాదని, వాటికి జగన్ గార్డియన్ మాత్రమేనని అన్నారు. నలుగురికీ సమానంగా పంచిపెట్టడమే జగన్ బాధ్యత అని చెప్పారు.
ఈ విషయం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు అందరికీ తెలుసన్నారు. వైఎస్ఆర్ బ్రతికి ఉన్నప్పుడు ఏ ఆస్తి పంపకాలు జరగలేదని, ఆయన మరణించిన తర్వాత కూడా ఆస్తి పంచలేదని అన్నారు. న్యాయంగా తనకు రావాల్సిన ఆస్తి తన చేతుల్లో లేదని షర్మిల వాపోయారు. వైఎస్ఆర్ బ్రతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపిణీ జరిగిందన్న విషయం, తాను జగన్ ఆస్తుల్లో వాటా అడుగుతున్నానన్న విషయం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనకు వ్యక్తిగతంగా ఆస్తులపై మోజు లేదని, తన బిడ్డలకు ఆ ఆస్తులు చెందాలన్నదే వైఎస్ అభిమతమని షర్మిల క్లారిటీనిచ్చారు. సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది కాబట్టి ఏదైనా నమ్మించగలరని, కాబట్టే వైఎస్ఆర్ అభిమానులకు వాస్తవాలు తెలియాలని ఈ లేఖ రాస్తున్నానని చెప్పారు.