సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ భేటీ అయి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతి బుధవారం కేబినెట్ ఠంచనుగా భేటీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైసీపీ హయాంలో విశాఖ శారదాపీఠానికి కేటాయించిన భీమిలిలోని 15 ఎకరాల భూమిని రద్దు చేసింది. వాస్తవానికి ఇప్పటికే దీనిని రద్దు చేస్తూ..జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే.. ఇప్పుడు విధానపరంగా కూడా సర్కారు ఈ భూమిని వెనక్కి తీసుకునేందుకు.. రద్దు చేసేందుకు నిర్ణయించడం గమనార్హం.
ఉచిత గ్యాస్ పంపిణీపైనా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన ఉచిత గ్యాస్ పథకానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో దీపం పథకం అమలవుతున్న వారికి ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు. ముందుగానే మహిళలు నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయాలి. ఆ తర్వాత రెండు రోజుల్లో గ్యాస్ సిలిండర్ కోసం వెచ్చించిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వం వారి వారి ఖాతాల్లో వేయనుంది. అయితే.. కేంద్రం ఇచ్చే సబ్సిడీ పోగా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని లబ్ధి దారులైన మహిళలకు ఇవ్వనుంది. కనెక్షన్లు మహిళల పేరిటే ఉండాల్సి ఉంటుంది. ఒకేసారి మూడు సిలిండర్లు తీసుకోకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించారు.
ఇక, కీలకమైన మరో అంశంపైనా కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు మాసాలుగా అమలవుతున్న ఉచిత ఇసుక విధానంలో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం వీటిని సరిచేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగం గా వినియోగదారులకు ఇసుకను భారం కాకుండా చూడాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీనరేజ్ ఛార్జీల రద్దుతో ప్రభుత్వం రూ.264 కోట్ల ఆదాయం కోల్పోనుందని అంచనా వేశారు. అయినప్పటికీ… దీనిని అమలు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించడం గమనార్హం.
మరికొన్ని నిర్ణయాలు..
+ ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించనున్నారు. దీనికి సంబందించి సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
+ ఇసుక లేనిచోట ప్రత్యకంగా మినరల్ ఏజెంట్లను రంగంలోకి దింపి.. ఇసుకను సరఫరా చేయించనున్నారు.