రజినీకాంత్ కెరీర్ పూర్తిగా డౌన్ అయిపోయింది అనుకున్న సమయంలో ఆయనతో పాటు అభిమానులకు మంచి హై ఇచ్చిన సినిమా ‘జైలర్’. కోలమావు కోకిల, డాక్టర్, బీస్ట్ చిత్రాలను రూపొందించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. రజినీకి చాలా ఏళ్ల నుంచి సరైన సక్సెస్ లేకపోవడం, నెల్సన్ చివరి చిత్రం ‘బీస్ట్’ డిజాస్టర్ కావడంతో ‘జైలర్’పై పెద్దగా అంచనాలు లేవు.
కానీ ఆ సినిమా రజినీ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఉర్రూతలూగించి బ్లాక్ బస్టర్ అయింది. బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీని తర్వాత రజినీ నుంచి వచ్చిన రెండు చిత్రాలు నిరాశపరిచినా.. ‘జైలర్’ సీక్వెల్‌కు మాత్రం మంచి హైప్ ఉంది. నెల్సన్ మరో సినిమా చేయకుండా ‘జైలర్-2’ మీదే పని చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.
ఐతే ‘జైలర్-2’ను ఇంకా పెద్ద స్థాయిలో తీయడానికి సన్నాహలు చేసుకుంటున్న నెల్సన్ ఈ ప్రాజెక్టులోకి రజినీకాంత్ అల్లుడు ధనుష్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ధనుష్ గతంలో రజినీతో పని చేస్తే ఆశ్చర్యంగా ఏమీ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు అతను రజినీకి అల్లుడు కాని అల్లుడు. రజినీ కుమార్తె ఐశ్వర్య నుంచి అతను దూరంగా ఉంటున్నాడు. వీళ్లిద్దరూ విడాకులు తీసుకోనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ అధికారికంగా ఇంకా విడాకులైతే తీసుకోలేదు.
కానీ దూరంగా ఉంటున్నారు. కానీ రజినీ మీద ధనుష్ అభిమానం, గౌరవం ఏమీ తగ్గలేదు. ఇటీవల ‘వేట్టయన్’ రిలీజవుతుంటే ధనుష్ ఎగ్జైట్మెంట్ చూపించాడు. వీలు దొరికినపుడల్లా రజినీ మీద తన అభిమానాన్ని చాటుతూనే ఉంటాడు. ఈ నేపథ్యంలో ‘జైలర్-2’లో ధనుష్ నటించబోతున్నాడనే వార్త అందరినీ ఎగ్జైట్ చేస్తోంది. మరి ధనుష్ ఈ సినిమాలో నటించడం మీద రజినీకి కూడా అభ్యంతరాలు లేదంటే విశేషమే. వీళ్లిద్దరూ కలిసి తెరపై కనిపిస్తే సినిమాకు వచ్చే హైపే వేరుగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.