తెలంగాణ జనాలు.. మాజీ సీఎం కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారని.. బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారు. దసరా పండుగ వస్తే.. కేసీఆర్ హయాంలో ప్రతి తెలంగాణ పల్లె కూడా ఆనందంతో ఉండేదని..కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాజాగా బీఆర్ ఎ స్ నేత, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు పేల్చారు. “రేవంత్రెడ్డి ఏనాడైనా నిజాలు చెప్పిండా?“ అని ప్రారంభించి.. ఆయన హయాంలోను ఎన్నికల సమయంలోనూ చెప్పినవి, చెబుతున్నవి అన్నీ కూడా.. అబద్ధాలేనని చెప్పారు. అందుకే ఆయనను మోసంరెడ్డి అని వ్యాఖ్యానిస్తున్నామని తెలిపారు. ఎన్నికలకు మహిళలకు తులం బంగారం ఇస్తామన్నాడు ఏమందని ప్రశ్నించారు.
ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని, విద్యార్థినుల కష్టాలు తుడుస్తానని రేవంత్రెడ్డి చెప్పాడు.. కానీ, చేసిండా? అని అన్నారు. తెలంగాణ ఆడ బిడ్డలను ఉసురు పెట్టిన వోడు బాగుపడడని శాపనార్థాలు పెట్టారు. ఇంట్లో వృద్ధులకు, కోడలికి కూడా పింఛను ఇస్తామన్నాడు.. కానీ, ఒక్కరికి కూడా పింఛను ఇవ్వలేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణంలో ఆడవాళ్లు కొట్టుకునే పరిస్థితి తీసుకువచ్చారని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అయినా.. ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు.
పండగ పూట .. ఎవరైనా ఎక్కడైనా ప్రభుత్వాన్ని తలుచుకునేలా పాలన ఉండాలని, కానీ, మన రాష్ట్రంలో కేసీఆర్నే ప్రజలు గుర్తు చేసుకున్నట్టు కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ సర్.. హయంలోనే తాము నాలుగు ముద్దలు పప్పన్నం తిన్నమని గుర్తు చేసుకున్నారని చెప్పారు.