నందమూరి నటసింహం బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ తెలుగు ఓటీటీ ‘ఆహా’ కు కొత్త జోష్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాస్ కా బాప్ బాలయ్య వ్యాఖ్యాతగా ఉన్న ఈ షో బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ గా దూసుకుపోతోంది. ఈ షోలో తన నటనతో, ప్రశ్నలతో బాలయ్య తోటి తారలను ఇంటర్వ్యూ చేసే విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ క్రమంలోనే బాలయ్య టాక్ షో 2022లో IMDBలోని టాప్ 10 రియాలిటీ టీవీ షోల జాబితాలో 5వ స్థానం దక్కించుకుంది. ఒక తెలుగు టాక్ షోకు ఇటువంటి అరదైన గౌరవం దక్కడం బహుశా ఇదే తొలిసారి.
మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే తాజాగా నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఈ షో నాలుగో సీజన్ ట్రైలర్ రిలీజ్ చేసింది ఆహా యూనిట్. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, దర్శకుడు అనిల్ రావిపూి తదితరులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆ షో గురించి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అల్లు అరవింద్ వల్లే తాను ఈ టాక్ షో చేస్తున్నానని, ఆయన కాకుండా ఇంకెవరైనా అడిగి ఉంటే నో చెప్పేవాడినని అన్నారు. ఈ తరహాలో ఇతర ప్రోగ్రామ్ లు చేయాలని తనను అడిగిన వారికి నో చెప్పానని గుర్తు చేసుకున్నారు. అన్ స్టాపబుల్ షో సమయంలో తామందరం ఒక కుటుంబంలా కలిసిపోయామని, సమష్టి కృషి ఫలితమే ఈ టాక్ షో సక్సెస్ సీక్రెట్ అని అన్నారు. తెలుగు ప్రజలందరికీ బాలయ్య దసరా శుభాకాంక్షలు తెలిపారు.