ఈ వారం థియేటర్స్ లో సందడి చేయనున్న చిత్రాల్లో `విశ్వం` ఒకటి. టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంలో అందాల భామ కావ్య థాపర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. జిషు సేన్‌గుప్తా, శ్యామ్, నరేష్, సునీల్, ప్రగతి, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. కె.వి గుహన్ మ్యూజిక్ అందించాడు.
చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై వేణు దోనెపూడి, ప్రభాకర్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన విశ్వం మూవీ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్స్ సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ప్రచార కార్యక్రమాలతో చిత్రబృందం మరింత బజ్ క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. విశ్వంపై హీరో గోపీచంద్, హీరోయిన్ కావ్య థాపర్, డైరెక్టర్ శ్రీను వైట్ల ముగ్గురూ భారీగా ఆశలు పెట్టుకున్నారు.
ఇందుకు కారణం లేకపోలేదు.. గోపీచంద్ హిట్ ముఖం చూసి చాలా కాలమే అయిపోయింది. ఇంకా చెప్పాలంటే 2014లో వచ్చిన లౌఖ్యం తర్వాత ఆ స్థాయి హిట్ గోపీచంద్ కు పడలేదు. ఆయన మార్కెట్ క్రమంగా డౌన్ అవుతోంది. మరోవైపు ఆకట్టుకునే అందం, నటనా ప్రతిభ ఉన్నా సరైన సక్సెస్ లేక కావ్య థాపర్ సతమతం అవుతోంది. ఈమె ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇస్మార్ట్ శంకర్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఇక శ్రీను వైట్ల విషయానికి వస్తే.. స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన ఆయన 2014 నుంచి వరుస ఫ్లాపులతో స్టార్డమ్ కోల్పోయారు. 2018లో రిలీజ్ అయిన అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత సుమారు ఐదేళ్లు గ్యాప్ తీసుకున్న శ్రీను వైట్ల.. విశ్వంతో గ్రాండ్ గా కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. విశ్వం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తే.. గోపీచంద్ మార్కెట్ మళ్లీ పుంజుకుంటుంది. కావ్య థాపర్ కు అవకాశాలు పెరుగుతాయి. ఇక శ్రీను వైట్ల మునుపటి మాదిరి డైరెక్టర్ గా ఫుల్ బిజీ అవుతారు. మరి ఈ ముగ్గురి దశను విశ్వం ఏ మేరకు మారుస్తుందో చూడాలి.