నవ్యాంధ్రలో వృద్ధులు, వితంతువుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జగన్ కు చేతకాని పనిని సీఎం చంద్రబాబు చేసి చూపిస్తున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా సామాజిక పింఛనును రూ.4 వేలు చేయడమే గాక ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా రూ.వెయ్యేసి పెంచి జూలై 1న అందరికీ రూ.7 వేలు పంపిణీచేశారు. పింఛన్ల చరిత్రలోనే ఒకే నెల రూ.ఏడు వేలు చేతికి అందడం ఇదే తొలిసారి. ఇక అందదు అనుకున్న సొమ్ము చేతికి రావడంతో లబ్ధిదారుల్లో తీవ్ర ఉద్వేగం… ముఖ్యమంత్రి, మంత్రులు స్వయంగా తమ ఇంటి గడప తొక్కి ఆ మొత్తం అందిస్తుంటే పట్టలేనంత సంబరం.
మొదటి నెలే కాదు.. రెండో నెలా అంతే! వెరసి రాష్ట్రమంతా పింఛన్ల పండగ ప్రతి నెలా 1న మహాసంరంభంగా సాగుతోంది. సంక్షేమపథంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి అడుగులోనే సూపర్ హిట్ కొట్టింది. ‘ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛను’ డబ్బులు తీసుకున్న లబ్ధిదారుల ముఖాల్లో ఇంద్రధనస్సులోని సప్తవర్ణాలూ కళగట్టాయి. మరోవైపు పెన్షన్ల పంపిణీ అనేది ఉద్యోగులతో వీలు కాదు.. వలంటీర్లతోనే అది సాధ్యమవుతుందంటూ ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం చేసిన వాదనలను గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు పటాపంచలు చేశారు.
‘బ్యాంకులకు వెళ్లి పింఛను డబ్బులు డ్రా చేసుకుని వచ్చేది మేం.. మాకు వాటిని పంపిణీ చేయడం చేతకాదా’ అని అప్పట్లో తేల్చిచెప్పిన ఈ ఉద్యోగులు.. అన్నట్టుగానే ఒక్కరోజులోనే పింఛన్ల పంపిణీని దాదాపు పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయం 5.30 గంటలనుంచే ప్రారంభించి.. రాత్రి ఎనిమిది గంటల సమయానికి 95 శాతం వరకు పంపిణీ చేసేస్తున్నారు. మిగులూ తరుగూ ఉంటే మర్నాడు పూర్తిచేస్తున్నారు.
పరుగు వేగంతో పూర్తి…
రాష్ట్రంలో 1.2 లక్షలమంది సచివాలయాల ఉద్యోగులు ఉన్నారు. ఉన్నత విద్యావంతులు కావడం, సాంకేతిక నైపుణ్యం తెలిసినవారు కావడంతో వీరు పెన్షన్ల పంపిణీలో తమకిచ్చిన టార్గెట్‌ను అందుకోగలుగుతున్నారు. బయోమెట్రిక్ యంత్రాల ద్వారా వేగంగా ప్రక్రియను ముగిస్తున్నారరు. నిజానికి, గతంలో కూడా వలంటీర్లు….సచివాలయ ఉద్యోగుల సహకారం లేకుండా పెన్షన్లు పంపిణీ చేయలేదు.
డబ్బులు బ్యాంకుల నుంచి డ్రా చేసి వలంటీర్లకు అందించడంతోపాటు వారికి సాంకేతిక సహకారం అందించేవారు. ఇప్పుడు వారే రంగంలోకి దిగడంతో పంపిణీ తేలికైంది. విధి నిర్వహణలో వీరు చూపిస్తున్న పట్టుదలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు అభినందిస్తున్నారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు కూడా ఒకటో తేదీన లబ్ధిదారులకు ఎక్కడో చోట స్వయంగా పింఛన్లు పంపిణీ చేస్తుండడం విశేషం.
ఇప్పుడేమంటారో..?
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు వలంటీర్లు పెన్షన్ల పంపిణీ చేయరాదని ఈసీ ఆదేశాలిచ్చింది. సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లను పంపిణీ చేయాలని సూచించింది. అయితే అప్పట్లో ఎన్నికల కమిషన ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం ధిక్కరించింది. సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం సాధ్యం కాదని ఎన్నికల కమిషనకు లేఖ రాసింది. అప్పటి సీఎస్ జవహర్‌రెడ్డి కోర్టుకు సైతం ఇదే అంశం తెలిపారు.
ప్రభుత్వం కోర్టును సైతం తప్పుదోవ పట్టించి…. పెన్షన్లను సచివాలయాల వద్దకు వచ్చి తీసుకోవాలని మార్గదర్శకాలిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి ఎండలో సచివాలయాలకు వచ్చిన పండుటాకులు వేడిమి తట్టుకోలేక ఇబ్బందులు పడ్డారు. సుమారు 33 మంది మృత్యువాత పడ్డారు కూడా. అయినా వైసీపీ ప్రభుత్వం తాను అనుకున్నదే జరగాలన్న పట్టుదలతో వ్యవహరించింది. ఎన్నికల కోడ్ సమయంలో కూడా ఉన్నతాధికారులు అలానే వ్యవహరించారు.
ఈసారి పెన్షన మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు. బ్యాంకు అకౌంట్లు లేకపోవడం, ఉన్న అకౌంట్లు ఆధార్‌తో లింక్ కాకపోవడం, కొందరికి పనిచేయని బ్యాంక్ ఖాతాల్లో జమ కావడంతో పింఛనుదారులు నరకం చూశారు. ఇలా ఎన్నికల సమయంలో వైసీపీ సర్కారు.. పెన్షనర్లతో ఆటాడుకుంది. వలంటీర్లు లేకుంటే పెన్షన్లు అందవన్న భావన కలిగించేందుకు అప్పట్లో తీవ్ర ప్రయత్నాలు చేశారు. వలంటీర్లతోనే సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యమని గట్టిగా ప్రచారం చేసుకున్నారు.
పైగా టీడీపీ ప్రభుత్వం వస్తే వలంటీర్లను తొలగిస్తారని, పెన్షన్లు తమలా ప్రతి నెలా ఇంటింటికీ వచ్చి ఇవ్వరని దుష్ప్రచారం చేశారు. జగన్ అండ్ కో దుర్మార్గాలను స్వయంగా చూసిన వృద్ధులు, వితంతువులు.. టీడీపీ కూటమిని మనసారా ఆశీర్వదించారు. అందుకు ఫలాలను కూడా అందుకుంటున్నారు. దివ్యాంగులు సైతం నెలనెలా రూ.6 వేలు అందుకుంటున్నారు. గతంలో వారికి రూ.3 వేలు మాత్రమే అందేది. చంద్రబాబు పింఛనును రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు.
లబ్ధిదారులందరికీ సీఎం చంద్రబాబు జూలైలో బహిరంగ లేఖ రాశారు. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది లబ్ధిదారులకు జూలై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తున్నామని.. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ.. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడుతుందని.. అయినా వారి శ్రేయస్సు దృష్ట్యా దానిని భరించాలని నిర్ణయించామని వెల్లడించారు.