ఈ రోజు నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి సతీ సమేతంగా శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. పెద్ద శేష వాహన సేవలో కూడా చంద్రబాబు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ అభినందనలు తెలిపారు చంద్రబాబు. బ్రహ్మోత్సవాలు 9 రోజులు జరుగుతాయని, స్వామివారు వివిధ రకాల వాహనాల్లో తిరుమాడ వీధుల్లో ఊరేగుతారని చంద్రబాబు అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఒక పవిత్ర భావంతో బ్రహ్మోత్సవాలను వీక్షిస్తారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం తరఫున అత్యధికసార్లు పట్టు వస్త్రాలు, ఇతర లాంఛనాలు సమర్పించే అదృష్టం తనకు దక్కిందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 15 లక్షల మంది భక్తులు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వస్తారని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా టీటీడీ అన్ని రకాల చర్యలు చేపడుతోందని అభినందించారు. పవిత్రమైన తిరుమలలో గోవింద నామస్మరణ మినహా మరేమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.