టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సురేఖ వ్యాఖ్యలను అక్కినేని ఫ్యామిలీతోపాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలోనే సురేఖకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. తనకు క్షమాపణ చెప్పకుంటే సురేఖపై పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.
ఈ క్రమంలోనే కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. నాగచైతన్య, సమంత విడిపోవడానికి తాను కారణమని సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యమని, తన ఇమేజ్ కు, గౌరవానికి, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా మాట్లాడినందుకు తనకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఇలా తనపై సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని, ఆమెకు తాను నోటీసులు పంపించానని కేటీఆర్ గుర్తు చేశారు.
కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్ననని, ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతారని చెప్పారు. ఇక, కొండా సురేఖపై జరిగిన ట్రోలింగ్‌ను ఒక మహిళగా ఖండించానని బీఆర్ఎస్ నేత సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బాధ్యతగల మంత్రిగా దిగజారి మాట్లాడటం సరికాదన్నారు. సురేఖను ఎవరో ట్రోల్ చేస్తే కేటీఆర్‌కు ఆపాదించడం, వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమను కామెంట్ చేసిన విషయం కొండా సురేఖ మరిచారా? అని ప్రశ్నించారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. మంత్రి పదవికి ఆమె అనర్హురాలు అని, సురేఖ వ్యాఖ్యలపై లీగల్‌గా ముందుకు వెళ్తామని అన్నారు. సురేఖ తన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, కాంగ్రెస్ నీచ సంస్కృతికి ఆమె వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు.