బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు టాలీవుడ్ లోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. చాలామంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని, సమంత-నాగ చైతన్య విడిపోవడానికి కేటీఆర్ కారణమని సురేఖ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యల వేడి సద్దుమణగక ముందే కొండా సురేఖ మరోసారి కేటీఆర్ పై, హీరో నాగార్జునలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య విడాకులు 100 శాతం కేటీఆర్ వల్లే అయ్యాయని, ఎన్ కన్వెన్షన్ హాల్ వివాదంతో ఇది మొదలైందని సురేఖ షాకింగ్ ఆరోపణలు చేశారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారని కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలోనే కేటీఆర్ దగ్గరకు వెళ్లాలని సమంతపై నాగార్జున, నాగ చైతన్య ఒత్తిడి చేశారని సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కానీ, కేటీఆర్ దగ్గరకు వెళ్లేందుకు సమంత ఒప్పుకోలేదని, కేటీఆర్ దగ్గరకు వెళ్లకపోతే ఇంటి నుంచి వెళ్లిపోవాలని సమంతకు నాగార్జున స్పష్టం చేశారని సురేఖ షాకింగ్ కామెంట్లు చేశారు.
ఆ కారణంతోనే సమంత ఇంటి నుంచి బయటకు వచ్చిందని, ఆ తర్వాత నాగచైతన్యతో విడాకులు తీసుకుందని సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఇక, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా కేటీఆర్ టార్చర్ చేశారని, కేటీఆర్ వల్లే రకుల్ టాలీవుడ్ నుంచి వెళ్లిపోయి హడావుడిగా పెళ్లి చేసుకుందని ఆరోపించారు.
ఈ క్రమంలోనే సురేఖకు మాజీ ఎంపీ మాలోత్ కవిత వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ గురించి ఏది పడితే అది మాట్లాడితే నాలుక చీరుస్తానంటూ హెచ్చరించారు. కేటీఆర్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని..ఉరికించి కొడతామని…ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. సురేఖపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. వీలైతే హైడ్రా బాధితులకు న్యాయం చేయాలని, అనవసర రాద్ధాంతం చేయొద్దని అన్నారు.