టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమంటూ తెలంగాణ మంతి కొండా సురేఖ సంచలన ఆరోపణ చేశారు. బాపూఘాట్ లో గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ కు అలవాటే అన్నారు. కేటీఆర్ కు తల్లి అక్క, చెల్లి లేరా? అని ప్రశ్నించారు.
హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసి.. వారి ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. సమంత, నాగచైతన్య విడిపోవడానికి కూడా కేటీఆరే కారణమని కొండా సురేఖ ఆరోపించారు. కేటీఆర్ వల్లే ఎందరో హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీని వదిలేస్తున్నారని.. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసని సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై బీఆర్ఎస్ వాళ్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
మంత్రి సీతక్క, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టినప్పుడు ఎందుకు నోరువిప్పలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. ఐదేళ్లు బీఆర్ఎస్లో పనిచేశా.. నా వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలుసన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి కానీ.. వ్యక్తిత్వాలను చంపే ప్రయత్నం చేమకూడదంతూ బీఆర్ఎస్ కు హితవు పలికారు. తనపై నీచమైన తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేశామని సురేఖ తెలిపారు.
అయితే మంత్రి సురేఖ ఆరోపణలపై తాజాగా కేటీఆర్ కూడా స్పందించారు. మాకు సంబంధం లేని వ్యవహారంలో కొండా సురేఖ మాపై ఏడుస్తుందని ఫైర్ అయ్యారు. కొండా సురేఖపై సోషల్ మీడియా పోస్టింగ్‌లతో తమకు సంబంధం లేదన్నారు. కొండా సురేఖ, సీతక్కలు మొదట సీఎం రేవంత్ నోరును ఫినాయిల్‌తో కడగాలని.. చేతకాకనే కాంగ్రెస్ తమపై దాడులు చేయిస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.