ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాలనలో సమూల మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు లేకుంటే పెన్షన్ల పంపిణీ జరగదని వైసీపీ నేతలు అన్నారని, కానీ, వాలంటీర్లు లేకుండానే పెన్షన్ల పంపిణీ విజయవంతంగా చేస్తున్నామని చెప్పారు. వాలంటీర్లను ఏం చేయాలి అన్న విషయంపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఉద్యోగులకు నెలనెలా జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. జగన్ హయాంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను ధ్వంసం అయ్యాయని. రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి ఖజానాను ఖాళీ చేసి జగన్ వెళ్లారని ఆరోపించారు.
కూటమి తరఫున 21 మంది ఎంపీలను గెలిపించి ప్రజలు మంచి పని చేశారని అన్నారు. జగన్ ను తాను డ్రగ్స్ స్మగ్లర్ పాబ్లో ఎస్కోబార్ తో పోల్చుతుంటానని, ఎస్కోబార్ కు ఎదురుతిరిగితే చంపేసేవాడని, జగన్ కూడా ఎస్కొబార్ లాంటి వ్యక్తి అని చంద్రబాబు విమర్శించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతోమంది రాజకీయనాయకులను చూశానని, ఇటువంటి వ్యక్తిని మాత్రం చూడలేదని అన్నారు.
సొంత బాబాయ్ వివేకాను లెక్కలోకి తీసుకోని వ్యక్తి, ప్రజలను లెక్క చేస్తాడా అని వ్యాఖ్యానించారు. జగన్ చెయ్యరాని పాపాలు చేశాడని, చెయ్యరాని తప్పులు చేశాడని, కానీ, ఆ పాపాలు ప్రజల పట్ల శాపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన 110 రోజుల్లో పెన్షన్ల పంపిణీ కోసం కూటమి ప్రభుత్వం 12508 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వెల్లడించారు.