ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ .. తిరుమలకు మెట్ల మార్గంలో చేరుకున్నారు. తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ అయిన ఆరోపణలు వచ్చిన తర్వాత.. పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రోజుకొక కార్యక్రమం ద్వారా హైందవ ధర్మాన్ని పరిరక్షించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక రోజు రాష్ట్ర వ్యాప్తం గా అన్ని ఆలయాల్లో విష్ణు సహస్త్రనామ పారాయణ చేపట్టారు. తర్వాత రోజు అభిషేకాలు, పూజలు, ఆ తర్వాత `ఓం నమో నారాయణాయ` మంత్ర పఠనం, భజనలు, సంకీర్తనలు ఇలా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఈ ప్రాయశ్చిత్త దీక్షను 11 రోజుల పాటు చేపట్టిన పవన్ కల్యాణ్ బుధవారం(అక్టోబరు 2) ముగించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయానికి ఆయన చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్న ఆయన.. అక్కడి అలిపిరి మెట్ల మార్గం ద్వారా.. శ్రీవారి ఏడు కొండలు నడిచి ఎక్కారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత.. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారి శ్రీవారి దర్శనానికి, ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు రావడంతో పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలతో పాటు మెగా అభిమానులు సైతం తిరుమలకు పోటెత్తారు.
మంగళవారం రాత్రి తిరుమలలోనే బస చేయనున్న పవన్ కల్యాణ్.. బుధవారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. అదేవిధంగా గురువారం కూడా పవన్ కల్యాణ్ తిరుమలలోనే ఉంటారు. శ్రీవారి ఆలయంలో జరిగే కైంకర్యాలకు వినియోగించే అన్ని పదార్థాలను ఆయన పరిశీలించనున్నారు. ముఖ్యంగా లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో నెయ్యిని కూడా ఆయన పరిశీలించనున్నారు.
అదేవిధంగా తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని కూడా పరిశీలించి.. సరుకుల నాణ్యతను పరిశీలించనున్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో ఆయన సమీక్ష చేయనున్నారు. నాణ్యత పెంచేందుకు ఉన్న అవకాశాలను ఆయన తెలుసుకుంటారు. అదేవిధంగా పలు సూచనలు కూడా చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సహా ఆ పార్టీ నాయకులు, టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు.