వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై అక్రమాస్తుల కేసులు ఉన్న విషయం తెలిసిందే. 2012లో ఆయన పార్టీ పెట్టిన తర్వాత.. అప్పటి కాంగ్రెస్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే శంకరరావు రాసిన లేఖ ఆధారంగా హైకోర్టు అప్పట్లో జగన్పై విచారణకు ఆదేశించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్న సమయంలో క్విడ్ ప్రోకో కింద.. కొన్ని సంస్థలు జగన్ వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయని, దీనికి ప్రతిఫలంగా వాటికి భూములు కేటాయించారనేది ప్రధాన కేసు.
ఈ సొమ్ములతోనే జగన్ అక్రమాస్తులు పోగేసుకున్నారన్నది అభియోగం. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు.. దీనిని సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం ఇంకా ఈ కేసులు విచారణ దశలోనే ఉన్నాయి. ఇంతలోనే జగన్ను అరెస్టు చేయడం.. 16 నెలలు జైల్లో పెట్టడం తెలిసిందే. అయితే.. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు… సుప్రీంకోర్టులో జగన్ తరఫున వాదనలు వినిపించిన న్యాయ వాది కేవీ విశ్వనాథన్. ఈయనే జగన్కు బెయిల్ వచ్చేలా వాదించారన్నది అప్పట్లో తెలిసిన విషయమే.
అయితే.. ఇప్పుడు నాటి జగన్ కేసులను వాదించిన లాయర్ కేవీ విశ్వనాథన్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా పనిచేస్తున్నారు. కేరళకు చెందిన కల్పాతి వెంకటరామన్ విశ్వనాథన్.. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉంటూ.. ఈ స్థానానికి ప్రమోట్ అయ్యారు. 19 మే 2023న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అయితే.. ఆయన న్యాయవాదిగా ఉన్న సమయంలో జగన్ కేసుల్లో వాదనలు వినిపించడంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగింది.
అయితే.. ఇప్పుడు ఈయన వార్తల్లో ప్రధాన వ్యక్తిగా ఎందుకు నిలిచారంటే.. తాజాగా ఏపీకి చెందిన తిరుమ ల తిరుపతి దేవస్థానం పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ అయిందన్న పిటిషన్లు వచ్చాయి. వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవాయ్ తో కలిసి జస్టిస్ కెవీ విశ్వనాథన్ ఆయా పిటిషన్లను విచారించారు. తిరుమల లడ్డు ప్రసాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో విశ్వనాథన్ ఎవరు? బీఆర్ గవాయి నేపథ్యాలపై చర్చ, ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈయనతో పాటు లాయర్ గా అప్పటికే పేరుపొందిన ముకుల్ రోహ్ తగి ఇప్పటికీ ప్రముఖ న్యాయవాదిగానే ఉన్నారు.