తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే లడ్డూ ఇష్యూ నేపథ్యంలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆలయ సంప్రదాయం ప్రకారం.. అన్యమతస్థుడైన జగన్ డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెడితేనే శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతించాలని హిందుత్వ సంఘాలు, కూటమి నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
డిక్లరేషన్ ఇవ్వడానికి అంగీకరించని జగన్.. తన తిరుమల టూర్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. వాస్తవానికి జగన్ తిరుమలకు వెళ్ళి, డిక్లరేషన్ మీద సంతకం గనుక చేసి ఉంటే.. వైసీపీకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అయ్యేది. కానీ అతి తెలివి ప్రదర్శించి అటు కూటమి నాయకులు, ఇటు ప్రజలకు నెగటివ్ అయ్యారు. పైగా దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ ఎలా అడుగుతారు..? మనం ఎలాంటి దేశంలో నివసిస్తున్నాం? ఇదేం దేశం.. ఇదేం హిందూయిజం..? అంటూ మీడియా ముందు జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడారు.
అయితే తాజాగా జగన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ సెటైర్లు పేల్చారు. ఎన్టీఆర్ భవన్లో 100 రోజుల పాలన – అభివృద్ధి సంక్షేమాలు పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సందర్శించిన మంత్రి అనగాని.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎంకు చురకలు వేశారు. తన మతం మానవత్వం అని చెప్పుకుంటున్న జగన్‌ది కౄరత్వమని.. భక్తుల మనోభావాలు గౌరవించి డిక్లరేషన్ ఇవ్వమంటే హిందూయిజంపై దాడి చేశారని అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ లడ్డూ వ్యవహారంలో జరిగిన తప్పు ఒప్పుకోలేక, క్షమాపణ చెప్పలేక జగన్ తిప్పలు పడుతున్నాడని.. అందుకే వంకర మాటలు మాట్లాడుతున్నాడని అనగాని సైటర్లు వేశారు.