గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ ప్రస్థానానికి నేటితో 17 ఏళ్లు పూర్తైంది. ఆయన డెబ్యూ మూవీ `చిరుత` 2007లో సరిగ్గా ఇదే రోజు విడుదలైంది. ఈ నేపథ్యంలోనే చిరుత గురించి పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన తనయుడిని ఇండస్ట్రీలోకి లాంఛ్ చేసే బాధ్యతను అప్పటికే మంచి ఫామ్ లో ఉన్న డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు అప్పగించారు. పూరి డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రమే చిరుత.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ సి. అశ్వని దత్ నిర్మించిన ఈ సినిమాతో బీహార్ బ్యూటీ నేహా శర్మ హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, తనికెళ్ల భరణి, సాయాజీ షిండే తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. మణిశర్మ సంగీతం అందించారు. చిరుత మూవీ రిలీజ్ సమయంలో తెలుగు సినిమా రంగంలో అంతకు ముందెన్నడూ లేనంత పబ్లిసిటీ జరిగింది. మెగా ఫ్యాన్స్ ఊరూరా పెద్దపెద్ద పోస్టర్లు ఏర్పాటు చేశారు. అన్నదానాలు, రక్తదానాలు చేశారు.
భారీ అంచనాల నడుమ 2007 సెప్టెంబర్ 28న ఆంధ్రప్రదేశ్లో 532, కర్ణాటకలో 44, తమిళనాడులో 4, ఒడిశాలో 3 మరియు ఓవర్సీస్లో 115 థియేటర్స్ లో విడుదలైన చిరుత.. హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రామ్ చరణ్ యాక్టింగ్ మరియు డ్యాన్సులకు మంచి మార్కులు పడ్డాయి. టాక్ అనుకూలంగా ఉండటంతో చిరుత బాక్సాఫీస్ వద్ద చెలరేగిపోయింది. వీకెండ్ ముగిసే సమయానికి ఏపీలోనే రూ. 12 కోట్ల షేర్ వసూలు చేసింది.
రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దూకిన చిరుత.. ఫుల్ రన్ లో రూ.25.19 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా బయ్యర్లకు రూ. 7 కోట్లకు పైగా లాభాలను అందించింది. అలాగే 178 సెంటర్లలో 50 రోజుల రన్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. 38 డైరెక్ట్ సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఇక చిరుత సినిమాను మలయాళంలో సేమ్ టైటిల్ తో మరియు తమిళంలోకి సిరుతై పులి పేరుతో డబ్ చేశారు. 2013లో బెంగాలీలో రంగబాజ్ పేరుతో చిరుతను రీమేక్ చేయడం జరిగింది.