తిరుపతి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడిన వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో పవన్ కళ్యాణ్ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయం వద్ద ఉన్న మెట్లను పవన్ కళ్యాణ్ స్వయంగా శుభ్రం చేసి మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు.
బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్….విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ విషయంతో ప్రకాష్ రాజ్ కు ఏం సంబంధం అని పవన్ ప్రశ్నించారు. తాను పరమతాన్ని నిందించలేదని, లడ్డూ అపవిత్రం అయిందని ఆవేదన వ్యక్తం చేశానని అన్నారు. సెక్యులరిజం గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారని, ఆయనతోపాటు సెక్యులరిజం గురించి మాట్లాడేవారంతా ఆలోచించాలని అన్నారు. ఇస్లాం గురించి, క్రిస్టియానిటీ గురించి వారు ఇలాగే జోకులు వేసి, వ్యంగ్యంగా మాట్లాడగలరా అని చురకలంటించారు.
తిరుపతి లడ్డు సెన్సిటివ్ విషయం అని, దాని గురించి మాట్లాడడం సరికాదని కొందరు నటులు అంటున్నారని పరోక్షంగా హీరో కార్తీపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. నటులుగా వారిని గౌరవిస్తామని, కానీ, లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అని ఇంకెప్పుడూ అనొద్దని అత్యంత సున్నితమైన తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతూ హాస్యాస్పదంగా స్పందించడం సరికాదని పవన్ అసహనం వ్యక్తం చేశారు. లడ్డూ వివాదం గురించి స్పందించాలంటే పద్ధతిగా స్పందించాలని, లేదంటే మౌనంగా ఉండాలని ఇండస్ట్రీలోని వారికి పవన్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే వైసిపి నేతలపై కూడా పవన్ మండిపడ్డారు. తప్పు జరిగి ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని లేకుంటే మౌనంగా ఉండాలని పవన్ సూచించారు. అలా కాకుండా సనాతన ధర్మంపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించబోనని వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్ ఇచ్చారు. హైందవ ధర్మాన్ని కాపాడుతామన్న సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి తనపై విమర్శలు చేయడం సరికాదని, అపవిత్రం జరిగిందని తెలిసినప్పుడు బాధ్యతగా ఏం చేయాలో చూడాలని హితవు పలికారు. తిరుపతి లడ్డుపై ఢిల్లీలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడిన తీరు బాధాకరమని అన్నారు.
కాగా, పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రస్తుతం తాను షూటింగ్ నిమిత్తం విదేశాలలో ఉన్నానని, అక్కడి నుంచి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ అన్న ప్రతి మాటకు జవాబిస్తానని చెప్పారు. తాను చేసిన ట్వీట్ ను పవన్ మరోసారి చదవాలని ప్రకాష్ రాజ్ కోరారు.