ఏపీలో సామాజిక పెన్షన్లపై సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తప్పుడు సర్టిఫికెట్లతో దివ్యాంగులమని చెప్పి పెన్షన్ తీసుకుంటున్న వారికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అటువంట వారు తమ పెన్షన్ ను స్వచ్ఛందంగా వదులుకోవాలని హెచ్చరించారు. ఇటువంటి దొంగ పెన్షన్లను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహించాలని, అర్హులకు పెన్షన్ ఇచ్చి, అనర్హులకు పెన్షన్ తొలగించాలని ఆదేశించారు.
ఇక, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు చెప్పారు. తదుపరి కేబినెట్ భేటీలో ఆ ప్రకారం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటు చేసేందుకు సమీక్ష నిర్వహించామన్నారు. జూనియర్ లాయర్లకు ప్రతి నెలా 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించారు. జూనియర్ న్యాయవాదులకు శిక్షణ అకాడమీ ఏర్పాటుకు రెడీ అవుతున్నామన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా 100 ఎకరాల్లో లా కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.