వైసీపీ అధినేత జగన్ కు ముప్పేట మంట రగులుతోంది. రాజకీయంగానే కాకుండా.. మతపరమైన వివా దంలోనూ ఆయన కూరుకుపోయారు. ఒకవైపు.. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదన్న ఆవేదన, మరోవైపు .. కీలక కేసుల్లో నాయకులు ఒకరు తర్వాత ఒకరుగా అరెస్టు కావడం.. ఇంకోవైపు.. నాయకులు కట్టకుని పార్టీ మారిపోతున్న పరిస్థితి.. వీటి నుంచి కోలుకోవడమే ఇప్పుడు వైసీపీకి దినదినగండంగా మారిపోయింది.
ఇలాంటి కీలక సమయంలో కోలుకోలేని దెబ్బగా తిరుమల లడ్డూ వ్యవహారం చుట్టుముట్టింది. అంతేకాదు, హిందూ సామాజిక వర్గం ఓట్లను ఈ ఘటన బదాబదలు చేసేసింది. ఎన్ని తేడాలు వచ్చినా భరించే.. హిం దూ సామాజిక వర్గం.. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేస్తే.. మాత్రం తట్టుకునే పరిస్థితిలో అయితే ఉండరు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఒక్కరంటే ఒక్కరు జగన్కు అనుకూలంగా మాట్లాడే నాయకులు కనిపించడం లేదు.
ఒక్కరంటే ఒక్కరు.. జరిగిన ఘటనను సమర్థించే వారు కూడా లేదు. ఇలాంటి సమయంలో జగన్ను కాచుకునేదెవరు? బ్రోచేదెవరు? అనేది కీలక అంశం. అంతేకాదు.. తాజాగా ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. చంద్రబాబును లైన్లో పెట్టాలని.. ఆయనను అదుపు చేయాలని.. తిరుమల లడ్డూ విషయంలో స్పందించాలని మోడీని వేడుకున్నారు. కానీ, ఇలాంటి విషయాల మెట్లపైనే బీజేపీ అడుగులు పడుతున్న నేపథ్యంలో మోడీ అస్సలు పట్టించుకునే ఛాన్స్ లేనేలేదు.
ఎంత దత్తపుత్రుడని భావించినా.. జగన్కు మోడీ సహకారం అందే అవకాశం కూడా కనిపించడం లేదు. మోడీ విషయాన్నే తీసుకుంటే.. ఇటీవల జరిగిన వినాయకచవితి సందర్భంగా.. ఆయన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో జరిగిన పూజలకు హాజరయ్యారు. దీనిని కాంగ్రెస్ తప్పుబట్టింది. అయితే.. ఈ విమర్శలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ.. ఇంటా బయటా కూడా.. మోడీ రాజకీయం చేస్తున్నారు.
ఇలాంటి మోడీ.. ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్న తిరుమల లడ్డూ విషయంలో జోక్యం చేసుకుని జగన్కు సర్టిఫికెట్ ఇస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎలా చూసుకున్నా.. జగన్ను బ్రోచేవారు.. కాచేవారు .. కనిపించకపోవడం గమనార్హం.