టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో చేయబోయే తన తదుపరి సినిమా కోసం మేకోవర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుంచి ఆయన పెద్దగా బయట కనిపించడం లేదు. ఎక్కువగా ఫారెన్ కంట్రీస్ లోనే గడుపుతున్నారు. అయితే భార్య నమ్రతతో కలిసి మహేష్ తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మీట్ అయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్డున పడిన వరద బాధితులను ఆదుకునేందుకు ఎందరో సెలబ్రిటీలు ముందుకు వచ్చారు.
అందులో మహేష్ బాబు కూడా ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు చెరో రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన మహేష్.. తాజాగా సతీసమేతంగా జూబ్లీహిల్స్లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రిని కలిశారు. వరద బాధితుల కోసం రూ. 50 లక్షల చెక్కుని మహేష్ దంపతులు రేవంత్ రెడ్డికి అందించారు. అలాగే ఏఎమ్బీ సినిమాస్ తరపున మరో రూ. 10 లక్షలు కూడా విరాళం అందజేశారు. దీంతో మహేష్ నమ్రత దంపతులను రేవంత్ రెడ్డి అభినందించారు. శాలువా వేసి సత్కరించారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలో బయటకు రావడంతో.. మహేష్ బాబు షాకింగ్ లుక్ చూసి ఫ్యాన్స్ మరియు సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో మున్నెప్పుడూ కనిపించని సరికొత్త అవతార్ లో మహేష్ దర్శనమిచ్చాడు. తాజా లుక్ చూశాక రాజమౌళి-మహేష్ సినిమాపై అందరిలోనూ అంచనాలు మరింత భారీగా పెరిగిపోయాయి. కాగా, వీరి కాంబో చిత్రం అమేజాన్ అడవుల నేపథ్యంలో ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కబోతోంది. సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎల్. నారాయణ నిర్మించబోతున్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.