తిరుపతి లడ్డూలో జంతువుల నెయ్యి, కొవ్వు కలిశాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు, ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తీవ్రస్థాయిలో స్పందించారు. లడ్డూ తయారీకి వాడే ఆవు నెయ్యిలో పంది కొవ్వు, మటన్ లో ఉండే టాలో అనే కొవ్వు పదార్థం కలిసినట్టు టెస్టుల్లో నిర్ధారణ అయిందని తెలిపారు. బ్లూ మీడియా తప్ప మిగిలిన మీడియా చానెళ్లు ఆ వార్తను కవర్ చేశాయని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిన మాట వాస్తవమని, టీటీడీ ఈవో కూడా స్టేట్ మెంట్ ఇచ్చారని రఘురామ చెప్పారు. తిరుమలో భక్తులను గత ప్రభుత్వం దోపిడీ చేసిందని మండిపడ్డారు. లీటర్ వాటర్ బాటిల్ ధర 60 రూపాయలుగా ఉండేదని అన్నారు.
ఇక, ఆ వార్త వినగానే వెంకన్న భక్తుడిగా తాను తల్లడిల్లిపోయానని మోహన్ బాబు చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందువూ కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తారని అన్నారు. మూడు నెలల క్రితం వరకు లడ్డూలో జంతువుల కొవ్వు కలుపుతున్నారని తెలిసిన వెంటనే దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, అత్యంత నీచం, హేయం, అరాచకమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ఆరోపణలు నిజమైతే నేరస్తులను కఠినంగా శిక్షించాలని తన మిత్రుడు, ఆత్మీయుడు, సీఎం చంద్రబాబును హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని అన్నారు. కలియుగదైవం శ్రీనివాసుడి ఆశీస్సులను తన మిత్రుడు అందుకుని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.