చూస్తుండగానే అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర్లోకి వచ్చేశాయి. మహా అయితే మరో రెండు నెలలు మాత్రమే. నవంబరులో జరిగే ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ బరిలో ఉంటే.. డెమొక్రట్ల అభ్యర్థిగా కమలా హారిస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రోటీన్ కు కాస్త భిన్నంగా ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎన్నికల్లో వేలు పెట్టటమే కాదు.. తన మద్దతు మొత్తం ట్రంప్ కేనన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేయటం తెలిసిందే. అంతేకాదు.. ఆయన భారీగా విరాళాలు ఇస్తున్నారు.
ఇక్కడే ఒక ఆసక్తికర అంశం వెలుగు చూసింది. టెస్లా అధినేతగా ఉన్న ఎలాన్ మస్క్.. తన మద్దతు ట్రంప్ కు ఇస్తుంటే.. అందులో పని చేసే ఉద్యోగులు మాత్రం డెమొక్రట్ల అభ్యర్థి కమలా హారిస్ వైపు మొగ్గు చూపుతున్న వైనం వెలుగు చూసింది. సంఖ్యా పరంగా చూసినప్పుడు టెస్లా ఉద్యోగులదే పైచేయి ఉండగా.. పార్టీకి విరాళాల విషయంలో మాత్రం యజమాని మస్క్ అందనంత దూరంలో ఉన్నారు.
తాజాగా వెల్లడైన ఓపెన్ సీక్రెట్ నివేదిక ప్రకారం.. మస్క్ కు చెందిన టెస్లా.. స్పేస్ ఎక్స్.. ఎక్స్ ఉద్యోగులు ట్రంప్ కంటే కమలా హారిస్ కే ఎక్కువ విరాళాలు ఇచ్చినట్లుగా సమాచారం. ట్రంప్ ప్రచారానికి టెస్లా ఉద్యోగులు 24,840 డాలర్లు ఇవ్వగా.. కమలా హారిస్ కు మాత్రం 42,824డాలర్లు ఇచ్చినట్లుగా గుర్తించారు. అదే సమయంలో మస్క్ కు చెందిన మరో సంస్థ స్పేస్ ఎక్స్ ఉద్యోగులు ట్రంప్ నకు 7,652 డాలర్లు ఇవ్వగా.. హారిస్ కు 34,526 డాలర్లు ఇచ్చినట్లుగా తేల్చారు.
ఇక..ఎక్స్ ఉద్యోగుల విషయానికి వస్తే కమలా హారిస్ కు 13,213 డాలర్లు ఇస్తే.. ట్రంప్ నకు మాత్రం 500 డాలర్ల కంటే తక్కువ విరాళాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మస్క్ ఉద్యోగుల్లో ఎక్కువ మంది డెమొక్రటిక్ మద్దతు ఇస్తున్న విషయం వెల్లడైంది. మస్క్ విషయానికి వస్తే ఆయన ట్రంప్ అభ్యర్థత్వానికి పూర్తి మద్దతు పలకటమే కాదు.. ఇటీవల కాలంలో వీరిద్దరి సంబంధాలు బలపడ్డాయి. అదెంత వరకు వెళ్లిందంటే.. ఇటీవల తన ఎక్స్ వేదికగా చేసుకొని ఇరువురు వివిధ అంశాల మీద చర్చించుకోవటం.. ప్రపంచ వ్యాప్తంగా వీరిద్దరి ఇంటర్వ్యూను ఆసక్తిగా వీక్షించటం తెలిసిందే.
తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే మస్క్ ను తన కేబినెట్ లో కీలక పదవి ఇస్తానని ట్రంప్ చెప్పగా.. అందుకు మస్క్ సైతం సానుకూలంగా స్పందించటం తెలిసిందే. గతంలో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. మిత్రులు ఉండరనటానికి ఇదో చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు.