అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం కచ్చితంగా వైఎస్ జగన్ స్వయంకృతాపరాధమే. ‘ఒక్క చాన్స్’ ఇచ్చిన ప్రజలపై ఐదేళ్లపాటు ఉక్కుపాదం మోపారు. ఒక చేత్తో సంక్షేమ బటన్లు నొక్కుతూ.. మరో చేత్తో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేశారు. అవినీతిపరుడని తెలిసీ పీఠమెక్కించినందుకు జగన్ రాష్ట్రమంతటా అరాచకాన్ని పండించారు. చేసింది ఏమీ లేక.. ప్రజల వద్దకు వెళ్లడానికి ముఖం చెల్లక పరదాలమాటున పయనించారు. ఐదేళ్ల ఆరాచకాలు, అక్రమాలు, అన్యాయాలను పంటిబిగువున భరించిన జనం చివరకు ఓటుతో బుద్ధి చెప్పారు. బటన్ నొక్కుళ్లకు దండంపెట్టి మరీ ఆయన పార్టీని ఇంటికి సాగన ంపారు. ప్రజాస్వామ్యంలో నియంతలు, ప్యాలెస్రాజులకు చోటే లేదని తిరస్కరించారు.
జనం అంతానికి పంతం
2019 ఎన్నికలప్పుడు ‘నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి ప్లీజ్’..‘రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తా’ అంటూ జగన్ ప్రజలను ప్రాధేయపడ్డారు. అప్పటికే ఆయనపై అవినీతి, అక్రమాస్తులు కేసులు ఎన్నో ఉన్నాయి. 16 నెలలు జైల్లోనూ ఉండివచ్చారు. అయినా సరే జగన్‌కు రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. అవినీతిపరుడని తెలిసినా గద్దెనెక్కించారు. అయితే ప్రజాధనంతో టీడీపీ హయాంలో అమరావతిలో నిర్మితమైన ప్రజావేదిక కూల్చివేతతో జగన్ తన పాలనకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత విధ్వంసమే ఎజెండాగా ఆయన పాలన ప్రజాకంటకంగా సాగింది.
ప్రజారాజధానిని నాశనం చేసి మూడు రాజధానులంటూ మూడుముక్కలాటకు తెరలేపారు. అప్పుడే ఆయనపై ప్రజలకున్న కొద్దిపాటి నమ్మకం కూడా పటాపంచలైపోయింది. ఒక్కసారి చాన్స్ ఇచ్చినందుకు రాజధానినే బలితీసుకున్నారన్న కసి సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తల వరకు వ్యక్తమైంది. కరోనా ప్రపంచాన్ని ఒకవైపు చుట్టేస్తుంటే.. ఏపీని జగన్ అరాచకాలు మరోవైపు అల్లుకుపోయాయి. భయంకరమైన కరోనాతో ప్రజల ప్రాణాలు పోతున్నా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టారు. అది సాధ్యం కాదన్నందుకు నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ఇంటికి పంపించాలని కుయుక్తులు పన్నారు.
చివరకు దౌర్జన్యాలు, దాదాగిరితో స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేసుకున్నారు. ఎవరినీ నామినేషన్లు వేయనివ్వలేదు. పట్టపగలు పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేతలు కిడ్నాపులు, దాడులకు పాల్పడ్డారు. జగన్ ఒంటెత్తుపోకడలు, నియంత చర్యలను వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్లమీదకు వస్తుండడంతో ఉద్యమాలను అణచివేయాలనుకున్నారు. పోలీసు వ్యవస్థను జేబు సంస్థగా వాడుకున్నారు. ప్రశ్నించిన గొంతులపై సీఐడీ రూపంలో విరుచుకుపడి అక్రమ, అన్యాయ కేసులు పెట్టారు. పిల్లలు, వృద్ధులు తేడాలేకుండా వేధింపులకు గురిచేశారు.
న్యాయమూర్తులపైనా దాడులు..
ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన, తప్పుపట్టిన కోర్టులు, న్యాయమూర్తులను వ్యక్తిగ తంగా టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా న్యాయమూర్తులను దూషించారు. జగన్ దావోస్, లండన్ పర్యటనలకు వెళ్తే.. జడ్జీలను దూషించిన కేసుల్లో నిందితులు అక్కడ ప్రత్యక్షమవ్వడం, జగన్ అండ్‌కోతో ఫొటోలు దిగడం, సీఐబీకి సవాల్ విసరడం ఓ అలవాటుగా మారిపోయాయి. చివరకు సీబీఐతో విచారణ చేయించినా దోషులు దర్జాగా తిరుగుతున్నారు. గత ఐదేళ్లలో అధికార యంత్రాంగాన్ని ప్రజావ్యతిరేక వ్యవస్థగా మార్చి జనంపైకి ఉసిగొల్పారు.
టీడీపీ యువనేత లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు, ప్రజలు ఆయనను కలవకుండా చేసేందుకు రోడ్లపై ఆంక్షలు విధిస్తూ బ్రిటిష్ చట్టాలను అమలు చేయాలనుకున్నారు. జీవో-1ని తీసుకొచ్చి ప్రజల పోరాట హక్కును అణచాలనుకున్నారు. చివరకు న్యాయమే గెలిచింది. జగన్ బ్రిటిష్‌రాజ్ నడవదని హైకోర్టు ఆ జీవోని నిలుపుదల చేసింది. మరోవైపు జగన్ తీరును బట్టి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోయారు. సామాన్యులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మహిళలపై దాడులకు తెగించారు. వీటిని సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నించిన ప్రజాస్వామికవాదులు, మేధావులపై పోలీసులు విరుచుకుపడ్డారు.
అక్రమ కేసులు, నిర్బంధాలతో రెచ్చిపోయి జగన్ సేవలో తరించారు. ఇదంతా జగన్‌లోని ఒక కోణ మే. ఆయన రెండోకోణం మరీ భయానకం. ఇసుక, మద్యం, గనుల్లో భారీదోపిడీకి తెరలేపారు. వేల కోట్లు దోచేశారు. ఇక అన్ని పథకాలకు తన పేరు, తన తండ్రి పేరు పెట్టుకున్నారు. ఆ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ చేపట్టారు. లబ్ధిదారుల్లో భారీగా కోతపెట్టి.. ప్రతి ఇంటికీ సంక్షేమం అందిస్తున్నామని ఊదరగొట్టారు. బటన్ నొక్కుళ్ల ద్వారా మొదట్లో సొమ్ము ఠంఛనుగానే అందింది. ఆ తర్వాత ఆదాయాన్ని, అప్పులను ఇతర అవసరాలకు మళ్లించడం మొదలుపెట్టారు.
అనంతరం ఉత్తుత్తి బటన్ నొక్కుడు మొదలుపెట్టారు. బటన్ నొక్కినా నెలా రెండు నెలలు డబ్బు జమకాని పరిస్థితి. ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యాదీవెన, వసతిదీవెన పథకాలకు బటన్ నొక్కారు. కానీ ఖాతాల్లో డబ్బులు వేయలేదు. ఎందుకంటే ఖజానాలోని సొమ్మంతా సన్నిహితులైన కాంట్రాక్టర్లకు పంచేశారు. మూడు నెలలు దాటినా జనం ఖాతాలకు డబ్బు రాలేదు. మే 13న పోలింగ్ అనగా.. నాలుగు రోజుల ముందు ఈ డబ్బు జమచేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి కోరారు. సాధారణంగా ఎల్లుండి పోలింగ్ అనగా ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగుస్తుంది.
ఇక ఏ పార్టీ కూడా ప్రచారం చేయడానికి, ప్రలోభపెట్టడానికి వీల్లేదు. అయితే జగన్ అండ్ కో చాలా మేధావులు. ప్రభుత్వ ధనంతో జనం ఓట్లు కొనే ప్రయత్నం చేశారు. నిధుల విడుదలకు కమిషన్ ఇందుకు అంగీకరించకపోవడంతో నాటి సీఎస్, జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కేఎస్ జవహర్‌రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. అక్కడ న్యాయమూర్తి ప్రచారం చివరి రోజు విడుదల చేయొచ్చని.. పోలింగ్‌రోజు, ఆ ముందు రోజు విడుదల చేయొద్దని గమ్మత్తు తీర్పు ఇచ్చారు. అయితే నిధులివ్వడం అక్రమమని తెలిసిన అధికారులు నిధుల విడుదలకు అంగీకరించలేదు.
దాంతో కోర్టు తీర్పు అమలు కాలేదు. లేదంటే ప్రజలను డబ్బుతో కొనేసేవారన్న మాటే! ఇక ఈ ఐదేళ్లలో భూముల కబ్జాలు, భవనాల కూల్చివేతలు అనంతం. శనివారం వస్తే చాలు.. విశాఖలో ఎవరో ప్రముఖుడి ఇంటిపై పడడం.. అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారని అభియోగంతో.. అర్ధరాత్రి నోటీసు ఇవ్వడం.. గంటా రెండు గంటలైనా కాకముందే బుల్డోజర్లతో కూల్చివేయడం పరిపాటిగా మారింది. కొందరు వైసీపీ నేతలైతే మరీ దారుణం.
పొరుగువాడు బాగుంటే సహించలేని స్థితికి వెళ్లారు. అక్రమంగా కట్టారంటూ ఇళ్లు కూల్పించడం.. ఇళ్లకు రోడ్డు లేకుండా మూసివేయడం.. ఇళ్లలో ఉన్నవారు బయటకు రాకుండా ఏకంగా ఇంటిముందే అడ్డుగోడలు కట్టడం.. మంచినీటి పైపులు ధ్వంసం చేయడం.. కరెంటు కనెక్షన్లు పీకేయడం.. బావుల్లో నీరు తీసుకెళ్లకుండా అడ్డుకోవడం.. ఇలాంటి అనేకానక అనుచిత కార్యాలకు పాల్పడ్డారు. అయితే జనం తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కలేదు. గుంభనంగా ఉండిపోయారు. అదను రాగానే ఈవీఎం బటన్ నొక్కి వీరి అరాచకాలకు అడ్డుకట్ట వేశారు.
కొంపముంచిన బాబు అరెస్టు..
రూ.లక్ష కోట్ల అవినీతి ఆరోపణలపై సీబీఐ జగన్‌ను అరెస్టుచేసింది. 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారు. సోనియాగాంధీతో రాజీపడి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతిచ్చే షరతుమీద బెయిల్ తెచ్చుకున్నారనేది బహిరంగ రహస్యం. తనను జైలుకు పంపింది సోనియాగాంధీ.. నాడు సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి. కానీ చంద్రబాబుపై కసిపెంచుకున్నారు. ఆయన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని హైకోర్టులో పిటిషన్ వేసింది కాంగ్రెస్ సీనియర్ నేత పి.శంకర్రావు. ఆయనకు అనుబంధంగా టీడీపీ సీనియర్ నాయకులు ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతిరాజు కూడా పిటిషన్లు వేశారు.
చంద్రబాబు ఆదేశాలతోనే వారలా చేశారని కత్తిగట్టారు. ఎర్రన్నాయుడు చనిపోవడంతో ఆ కోపాన్ని ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడిపై చూపారు. ఈఎస్ఐ స్కాంలో తప్పుడు ఆరోపణలతో అరెస్టుచేసి.. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి విజయవాడకు జీపులో తీసుకొచ్చారు. పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని అంతదూరం అలా ప్రయాణం చేయించడం అక్రమమైనా జగన్ ఆదేశాలతో సీఐడీ పోలీసులు అలా తీసుకొచ్చారు. కస్టడీలో ఉండగా ఆయనకు కరోనా సోకింది. కానీ ప్రభుత్వ వైద్యులతో తప్పుడు నివేదిక ఇప్పించి జైలుకు బలవంతంగా తరలించాలని చూశారు. కోర్టు ఆదేశాలతో ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు.
అలాగే అశోక్ గజపతిరాజు విజయనగర సంస్థానాధీశుడు. మాన్సాస్ ట్రస్టుకు, సింహాచలం సహా వందల దేవాలయాలకు అనువంశిక ధర్మకర్త. ఆ పదవి నుంచి ఆయన్ను తప్పించి.. ఆయన సోదరుడు ఆనంద గజపతిరాజు మాజీ భార్య కుమార్తెను వైసీపీ నేత విజయసాయిరెడ్డి తెరపైకి తెచ్చారు. కోర్టు జోక్యంతో ఆమె ఆ పదవుల నుంచి వైదొలగాల్సి వచ్చింది. చంద్రబాబును అరెస్టు చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధులు మళ్లించారన్న ఆరోపణలపై ఆయన్ను అర్ధరాత్రి నంద్యాలలో అరెస్టు చేశారు. 50 రోజులకుపైగా జైల్లో ఉంచారు.
అప్పటికి గాని జగన్ కసితీరలేదు. అయుతే ఆయన పతనం అప్పుడే నిశ్చయమైంది. ఏమీలేని కేసులో చంద్రబాబునే అరెస్టుచేశారంటే.. ఇంకెవరినీ వదలడని ప్రజలకు అర్థమైంది. బాబుపై సానుభూతి, జగన్‌పై ఆగ్రహం ఓట్ల రూపంలో పెల్లుబికాయి.
గెలిచేది 11 మందేనా..?
2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ ఏకంగా 151 చోట్ల గెలిచింది. టీడీపీ 23 చోట్ల గెలిచింది. జనసేన తరఫున నెగ్గిన ఒక్క ఎమ్మెల్యే ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. తాను చేసిన సంక్షేమానికి 175 సీట్లు ఎందుకు రావని జగన్ బీరాలు పలికారు. ఆ తర్వాత గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. రోడ్లు వేయకపోవడం.. మురుగుకాల్వలు బాగుచేయకపోవడంపై మండిపడ్డారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదని విరుచుకుపడ్డారు. అయినా జగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు.
క్షేత్ర స్థాయిలో జరిగేది ఆయనకు తెలుసో లేదో తెలియదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి జనం ఓట్లేశారు. 175 సీట్లకు గాను 11 చోట్ల మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఉమ్మడి విశాఖ, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున గెలిచారు. కడప జిల్లాలో జగన్ సహా ముగ్గురు మాత్రమే విజయం సాధించారు. జూన్ 9న విశాఖలో పదవీప్రమాణం చేయాలనుకున్న జగన్ ఆశలపై జనం అలా నీళ్లు గుమ్మరించారు.