తెలంగాణ నాయకుడు, ఎమ్మెల్యే అరెకిపూడి గాంధీ ఇంటిని పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. ఆదివారం తెల్లవారు జాము నుంచే ఆయన ఇంటిని పోలీసులు ముట్టడించారు. శేరిలింగం పల్లిలోని ఆయన నివాసాన్ని దాదాపు 200 మందికి పైగా పోలీసులు చుట్టుముట్టారు. అంతేకాదు.. ఆయన నివాసానికి దారి తీసే అన్ని మార్గాలను బారికేడ్స్‌తో మూసి వేశారు. దీంతో ఏం జరుగుతోందోనని స్థానికులు తీవ్రస్థాయిలో ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు భారీగా మోహరించడంతో స్థానికులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పోలీసులు ముందుగా ఎలాంటి హెచ్చరికలు చేయకపోవడంతో ఆదివారం చికెన్, మటన్ కొనుగోలు కోసం బయటకు వచ్చేవారు కూడా రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఈ పరిస్థితిపై స్థానికులు డీజీపీకి ఫిర్యాదులు చేయడం గమనార్హం. అయితే.. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఆధార్ కార్డు ఉన్నవారు బయటకు రావొచ్చని పోలీసులు సమాచారం ఇచ్చారు.
ఏం జరిగింది?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వర్సెస్ గాంధీల మధ్య రెండు రోజులుగా ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. గాంధీ ఇంటికి వచ్చి.. బీఆర్ఎస్ జెండాను పాతుతానని కౌశిక్ రెడ్డి సవాల్ రువ్వారు. ఈ నేపథ్యంలో గాంధీనే ఆయ న ఇంటికి తన అనుచరులతో వెళ్లి హల్చల్ సృష్టించారు. ఈ వివాదం గృహ నిర్బంధాలు.. అరెస్టుల వరకు కూడా వెళ్లింది. అయినా.. ఎవరూ వెనక్కి తగ్గలేదు. పైగా కౌశిక్ రెడ్డి ఆదివారం గాంధీ ఇంటిని ముట్టడించే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందింది.
కౌశిక్‌కు బీఆర్ఎస్ కీలక నాయకుల మద్దతు కూడా ఉండడం.. ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్న క్రమంలో గాంధీ ఇంటి వద్ద ఏదైనా జరగొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం నుంచి భారీ ఎత్తున పోలీసులు అప్రమత్తం చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డి కదలికలపైనా పోలీసులు డేగకన్ను సారించారు. ఆయన ఎక్కడికీ వెళ్లకుండా.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఇలా పోలీసులు గాంధీ ఇంటిని అష్టదిగ్బంధం చేశారు.