రాజకీయాల్లో రచ్చలు కామన్. పార్టీ అన్నాక నాయకుల మధ్య మరింత విభేదాలు కూడా కామనే. అయితే.. వీటిని పరిష్కరిం చుకునేందుకు నాయకులు, పార్టీలు కూడా ప్రయత్నిస్తాయి. ఇలా చేయడం తప్పుకాదు. ఈ ఏడాది ఎన్నికలకు ముందు తెనాలి టికెట్‌ను టీడీపీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆశించారు. కానీ, ఈ సీటును జనసేనకు అప్పటికే రిజర్వ్ చేశారు. ప్రస్తుత మంత్రి నాదెండ్ల మనోహర్ ఎప్పుడో కర్చీఫ్ వేసేశారు. అయినా.. తనకు న్యాయం చేయాలని రాజేంద్రప్రసాద్ పోరు పెట్టారు.
ఈ విషయంలో చంద్రబాబు నుంచి సమాచారం లేదు. దీంతో ఆలపాటి అలిగారు. హైదరాబాద్ వెళ్లి పోయారు. అయితే.. ఆయన లేకపోతే.. క్షేత్రస్థాయిలో వైసీపీ గెలిచే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టిన చంద్రబా బు వెంటనే మాజీ మంత్రులు.. దేవినేని ఉమా, అప్పటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ద్వారా కబురు పంపి కూల్ చేశారు. ఈ రాయబారం ఫలించింది. అంటే.. ఆలపాటికి సమ ఉజ్జీలను రంగంలోకి దింపి.. చంద్రబాబు రాయబార రాజకీయాలు చేసి సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు వైసీపీలోనూ ఇదే తరహా వివాదం కొనసాగుతోంది. అది కూడా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినే ని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈయనను పైకి కాదని అనుకుంటు న్నా.. ఆయన లేకపోతే.. పార్టీకి ఇబ్బందులు తప్పవని గ్రహిస్తున్న జగన్.. ఆయనను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన దగ్గరకు రాయబారాలు నెరుపుతున్నట్టు తెలిసింది. అయితే.. బాలినేనితో సమ ఉజ్జీలైన బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబాఉ, విజయ సాయి రెడ్డి, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి వంటివారిని పంపించాలి.
కానీ, జగన్ మాత్రం నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన మాజీ మంత్రి రజనీని బాలినేని వద్దకు పంపిస్తున్నార ని తెలిసింది. దీనికి బాలినేని మరింత రగిలిపోతున్నారు. ఇలా పంపించకుండా ఉండాలని ఆయన తన అనుచరులతో కబురు పంపించినట్టు సమాచారం. ఇది తనను అవమానించడమేనని.. ఇంత అవమానం తనకు అవసరం లేదని కూడా తన వారితో అన్నట్టు తెలుస్తోంది. ఇక, తాడో పేడో లేదని.. అంతా అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఒంగోలు వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.