వైసీపీ హయాంలో నటి కాదంబరి జెత్వానీ పై కొందరు వైసీపీ నేతలు వేధింపులకు దిగారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ బడా వ్యాపారవేత్త కుమారుడితో ప్రేమలో ఉన్న జెత్వానీని విజయవాడకు తీసుకువచ్చి నిర్బంధించారని ఆరోపణలు రావడం సంచలనం రేపింది. అంతేకాకుండా ఆ వ్యవహారంలో కొందరు పోలీసుల పాత్ర కూడా ఉందని ఆరోపణలు రావడం మరింత షాకింగ్ గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంలో ఓ వైసీపీ నేతపై తాజాగా కేసు నమోదైంది.
జెత్వానీ కేసులో వైసీపీ నేత విద్యా సాగర్ పై ఇబ్రహీంపట్నం పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి, తీవ్ర వేధింపులకు గురిచేశారని విద్యా సాగర్ పై జెత్వానీ ఫిర్యాదు చేశారు. జెత్వానీ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు…విద్యాసాగర్ తో పాటు మరికొందరు వ్యక్తులపై ఇబ్రహీపట్నం పీఎస్ లో కేసు నమోదు చేశారు. 192, 211, 218, 220, 354, 420, 467, 469, 471, రెడ్ విత్ 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరు వైసీపీ నేతలపై కూడా కేసులు నమోదయ్యే అవకాశముందని తెలుస్తోంది.