తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో 1400 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించిన వైనం సంచలనం రేపింది. వస్తువులు సరఫరా చేయకుండానే చేసినట్లు ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీని క్లయిమ్ చేసిన వైనాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు బట్టబయలు చేశారు. ఈ క్రమంలోనే ఈ భారీ కుంభకోణంలో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశి విశ్వేశ్వర రావు, డిప్యూటీ కమిషనర్ శివరాం, ప్రసాద్ లకు సీఐడీ తాజాగా నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
ఈ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను సీఐడి విచారణ జరిపి స్టేట్ మెంట్ నమోదు చేసేందుకు రెడీ అవుతోంది. ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఎగవేత ద్వారా భారీ మోసం జరిగిందని తేలింది. ఈ కుంభకోణంలో సోమేశ్ కుమార్ పేరును ఏ-5గా పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఏ-1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ-2గా ఉప కమిషనర్ ఎ.శివరామ్ ప్రసాద్, ఏ-3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ-4గా ప్లాయంటో టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి. బీఆర్ఎస్ సర్కార్ కు అనుకూలంగా సోమేశ్ కుమార్ వ్యవహరించారని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. తన ఐఏఎస్ పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సోమేశ్ కుమార్…ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు.