బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రగిలించిన వివాదం సరికొత్త రూపం సంతరించుకుంది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగాలని బీఆర్ ఎస్ నాయకులు నిర్ణయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కౌశిక్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు అధికార పక్షం నుంచి నిరసన పెరిగింది. దీనికి ప్రతిగా.. బీఆర్ ఎస్ నాయకులు కూడా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ ఆదేశాలతో పోలీసులు ముందుగానే అలెర్ట్ అయ్యారు.
శుక్రవారం ఉదయమే.. కోకాపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశా రు. అయితే.. ఈ సందర్భంగా ఆయన పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలోనే హరీష్ రావు ఇంటి వద్ద కు భారీగా చేరుకున్న పోలీసులు.. ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అటుగా వచ్చే వారిని ఎవరినీ లోపల కు రానివ్వడం లేదు., అదేసమయంలో హరీష్ రావు ఇంట్లో వారిని ఎవరినీ కూడా బయటకు రాకుండా అడ్డుకున్నా రు. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ముందస్తు అరెస్టులు చేశారు.
ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని బీఆర్ ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన బిఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా, బిఆర్ఎస్ శ్రేణులను అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే పై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, వారి అనుచరులు, కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. కాగా.. శుక్రవారం ఎట్టి పరిస్థితిలోనూ అరికపూడి గాంధీ నివాసం వద్దకు వెళ్తామని.. ఆయన ఇంటి ముందు.. బీఆర్ ఎస్ జెండాను పాతుతామని కౌశిక్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వివాదాలు పెరగకుండా .. పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.