టాలీవుడ్ లో ఉన్న టైర్-2 హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన తేజ్.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. నటుడిగానే కాకుండా మంచి డాన్సర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. 2021లో జరిగిన బైక్ యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్లు కెమెరాకు దూరంగా ఉన్న తేజ్.. మళ్లీ ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా పుంచుకుంటున్నాడు. ఇలాంటి టైమ్ లో తేజ్ కి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
మేనమామ పవన్ కళ్యాణ్ పై అమితమైన అభిమానాన్ని కలిగి ఉన్న సాయి ధరమ్ తేజ్.. ఆయన బాటలోనే నడవబోతున్నాడని, త్వరలో తేజ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీకి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక.. మెగా హీరోల్లో తేజ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీద ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలపై తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఘాటుగా కౌంటర్స్ ఇస్తున్నాడు.
అలాగే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇటీవల ఏపీలో వరద బాధితుల కోసం రూ. 10 లక్షలు విరాళం ప్రకటించాడు. మొన్నటికి మొన్న విజయవాడలోని ఆమ్మ ప్రేమ ఆరాధన వృద్ధాశ్రయాన్ని సందర్శించిన తేజ్.. అక్కడి వృద్ధుల కోసం రూ.5లక్షలను విరాళంగా ఇచ్చారు. అలాగే వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. ఈ పరిణామాలన్నీ తేజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే ప్రచారానికి బలాన్ని చేకూర్చాయి. మరి ఈ ప్రచారం పట్ల మెగా మేనల్లుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.