వైసీపీ అధినేత జగన్.. సుదీర్ఘకాలం తర్వాత కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆయన ఎంత తప్పించుకున్నా.. ఆయనకు కోర్టు ముఖం చూడక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. ఆయనపై అక్రమ ఆస్తులకు సంబంధించి అనేక కేసులు ఉన్నాయి. అయితే.. తాను ఓదార్పు చేసిన సమయంలో ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లారు. హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న సీబీఐ కోర్టుకు వెళ్లి హాజరయ్యారు. అయితే.. ముఖ్యమంత్రి అయ్యాక కోర్టుకు వెళ్లలేదు.
అప్పటి నుంచి ఆయన కోర్టులకు తన న్యాయ వాదులను మాత్రమే పంపిస్తున్నారు. అయితే.. ఇప్పుడు అక్రమాస్తుల కేసులో కాకుండా.. వ్యక్తిగతంగా ఆయన కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే.. ఆయనకు సంబంధించిన పాస్ పోర్టు వ్యవహారం. అధికారం కోల్పోయిన తర్వాత జగన్కు పాస్ పోర్టు ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పటి వరకు ఉన్న డిప్లొమాటిక్ పాస్ పోర్టు.. సీఎం పదవి పోయాక రద్దయింది. కానీ, విదేశాల్లో ఉన్న కుమార్తెలను కలుసుకోవాలని ఆయన చూస్తున్నారు.
ఈ క్రమంలో సాధారణ పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సీబీఐ కోర్టు ఎన్ వోసీ ఇచ్చింది. కానీ, ఆయనపై విజయవాడలో నమోదైన పరువు నష్టం కేసులో మాత్రం ఎన్వోసీ రాలేదు. ఇది వస్తే తప్ప.. జగన్కు పాస్ పోర్టు లభించే పరిస్థితి లేదు. ఇదే విషయాన్ని చెబుతూ.. విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్ దరఖాస్తుచేశారు. కానీ, ఇక్కడే ఆయనకు ఎదురు తన్నింది. నేరుగా కోర్టుకువచ్చి.. రూ.20 వేల ష్యూరిటీ ఇవ్వాలని కోర్టు తేల్చి చెప్పింది.
ఇదేసమయంలో ఐదేళ్లు కాదు.. ఒక ఏడాదికి మాత్రమే పాస్ పోర్టు ఇస్తామని కోర్టు చెప్పింది. ఈ రెండు విషయాలు కూడా.. జగన్కు మింగుడు పడలేదు. దీంతో ఆయన హైకోర్టు ను ఆశ్రయించారు. ఇక్కడ తీర్పు ఇంకా రాలేదు. కానీ, కోర్టుకు వెళ్లక తప్పదని అంటున్నారు న్యాయ నిపుణులు. ఎందుకంటే.. హైకోర్టు అయినా.. విజయవాడ కోర్టు అయినా.. కొన్ని నిబంధనలు పాటించాలనే చెబుతాయని.. కాబట్టి తన పాస్ పోర్టు కోసం.. విజయవాడ కోర్టుకు వెళ్లాలనే హైకోర్టు చెబుతుందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో విజయవాడ కోర్టుకు జగన్ రాక తప్పదన్న చర్చ జరుగుతోంది.