దిక్కుమాలిన మీడియా….అంటూ.. వైసీపీ అధికార పత్రిక సాక్షిపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. వరదలపై లేనిపోని రాతలు రాస్తున్నారని… దీంతో ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. “వరదలు వచ్చిన మొదటి రోజు నుంచీ చూస్తున్నా. ఇంత దిక్కుమాలిన రాతలు.. ప్రసారాలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు“ అని చంద్రబాబు అన్నారు. సాక్షి మొదటి పేజీలోనే ప్రభుత్వంపై విషం కక్కారని ఆయన విమర్శలు గుప్పించారు.
“కుదిరితే ప్రజలకు మేలు చేయాలి. లేకపోతే.. గమ్మునుండాలి. కానీ, ప్రజా విద్వేషం ప్రదర్శించేలా వీళ్లు .. వీళ్ల రాతలు ఉన్నాయి. ఇలాంటివాళ్లు ప్రజాజీవితంలోనూ.. రాజకీయ పార్టీల్లోనూ ఉండడానికి అనర్హు లు“ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. తాజాగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ పత్రికపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి రోజూ ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నార ని, నకిలీ రాతలు రాస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వైసీపీ పరిహాసం చేస్తోందని.. ఓడిపోయామనే కక్షతో వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. “వీళ్లందరూ ఇప్పుడెక్కడున్నారు? ప్రతిపక్షానికి బాధ్యతలేదా? మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలను ఇలా రెచ్చగొట్టామా?“ అని నిలదీశారు. “నిద్రలేస్తే ఆ పేపర్, ఆ టీవీలో అదే బతుకు“ అని అసహనం వ్యక్తం చేశారు.
ఏమో తెలీదు!
కానీ, కొన్ని అంశాలకు సంబంధించి చంద్రబాబు `ఏమో తెలీదు` అంటూ సమాధానం చెప్పారు. వరద బాధితులు 4 లక్షల మంది ఉన్నారని.. పునరావాస కేంద్రాలకు 42 వేల మందినిమాత్రమే తరలించారని.. మిగిలిన వారు ఎక్కడున్నారన్న ప్రశ్నకు ఆయన అదేసమాధానం చెప్పారు. ఇక, ప్రకాశం బ్యారేజి గేట్లను పడవలు ఢీకొని, గేట్లు దెబ్బతినడంపై అడిగిన ప్రశ్నకు కూడా.. “ఎవరు చేశారో తెలియడం లేదు. గుర్తించలేక పోతున్నాం“ అని వ్యాఖ్యానించారు.