విజయవాడలో సంభవించిన బుడమేరు వరద కారణంగా సర్వస్వం కోల్పోయిన లక్షల మందికి సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర వర్గాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు తమ విరాళాలను సీఎం చంద్రబాబును కలిసి నేరుగా అందిస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే విరాళాలు ఇచ్చేవారు.. విజయవాడలోని సీఎం తాత్కాలిక కార్యాలయానికి క్యూ కట్టారు. ఈ క్రమంలో మొత్తం 30 కోట్ల రూపాయలకు పైగానే.. ఒక్కరోజు సాయం అందింది.
ఇక, ప్రతిపక్షం వైసీపీ కూడా వరద బాధితులకు సాయం ప్రకటించింది. అయితే.. ఈ సాయంపై పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం.. మొత్తం కలిపినా.. కూడా 10 కోట్లరూపాయలకు మించకపోవడ మే. పేదల పక్షాన నిలుస్తామని.. తమది పేదల పార్టీ అని, పెత్తదారుల పార్టీ కాదని పదే పదే చెప్పిన విషయాన్ని రాజకీయ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకటించిన సాయంపై సర్వత్రా పెదవి విరుపులు కనిపిస్తున్నాయి.
ఇంతకీ.. వైసీపీ చేసిన సాయం చూస్తే.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు(లోక్సభ, రాజ్యసభ) ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. ఇది అంతా కలిపినా 10 కోట్ల రూపాయలకు మించదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ కు చెందిన ఒక పారిశ్రామిక నేరుగా 10 కోట్ల రూపాయలు అందించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అలాంటి ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు ఉన్న వైసీపీ నుంచి ఇంతేనా సాయం? అని వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు. ఈ సొమ్మును కూడా నేరుగా ప్రభుత్వానికి ఇవ్వబోమని వైసీపీ ప్రకటించింది. పార్టీ చేపట్టనున్న వరద బాధిత సహాయ కార్యక్రమాలకు ఈ విరాళాన్ని వినియోగించనున్నారని తెలిపింది. పార్టీ తరఫున ఇదివరకే కోటి రూపాయల సహాయాన్ని జగన్మోహన్రెడ్డి ప్రకటించారని, దాంతో ఇప్పటికే వరద బాధితుల కోసం పాల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు పెద్ద ఎత్తున పంపిణీ చేశారని తెలిపింది. వాస్తవానికి కోటి రూపాయలు.. అయ్యేంత ఖర్చు కాదని రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా వైసీపీ నేతలు చెప్పుకొంటన్నారనే విమర్శలు వస్తున్నాయి.