మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను మేడిగడ్డ బ్యారేజీ వివాదం వెంటాడుతోంది. అప్పటి ముఖ్య మంత్రిగా కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లా లో మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారు. అయితే.. ఇది కొన్నాళ్ల కిందట కుంగిపోయింది. దీనిపై అదే జిల్లాకు చెందిన రాజలింగమూర్తి అనే వ్యక్తి స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. అప్పటి సీఎంగా కేసీఆర్ సరైన పర్యవేక్షణ చేయలేదని, నిధులు దుర్వినియోగం అయ్యాయని.. మేడిగడ్డ బ్యారేజీ అందుకే కుంగిపోయిం దని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఆ నష్టాన్ని అప్పటి సీఎం సహా.. కలెక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి రాబట్టాలని పిటిషన్లో అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను గతంలోనే విచారించిన కోర్టు.. అప్పటి సీఎం కేసీఆర్, కలెక్టర్ సహా అధికారులకు నోటీసులు జారీ చేసింది. వీరిని నేరుగా కోర్టుకు రావాలని ఆదేశించింది. ఆ రోజు రానే వచ్చింది. గురువారం వారంతా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే.. అనివార్య కారణాలతో కోర్టుకు రాలేక పోతున్నామని వీరంతా సమాచారం అందించారు.
అయినప్పటికీ.. కోర్టు వీరిని వదిలి పెట్టలేదు. తాజాగా శుక్రవారం మరోసారి విచారణ చేసిన కోర్టు.. అక్టోబ రు 17న జరిగే విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు, అప్పటి కలెక్టర్, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సహా ఇరిగేషన్ అధికారులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇక, మాజీ మంత్రి హరీష్‌రావు తరఫున లాయర్లు లలితా రెడ్డి, సుకన్య… కాళేశ్వరం కాంట్రాక్ట్ సంస్థ అయిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ తరఫున సంస్థ ఎండీ కృష్ణారెడ్డి తదితరులు కోర్టుకు హాజరయ్యారు.