వైసీపీకి పెనుకష్టం వచ్చింది. ఒకవైపు ప్రజలు వరద నీటిలో చిక్కుకుని ఇబ్బందులు పడుతుంటే.. వైసీపీ నేతలు.. అనూహ్యంగా కేసుల వరదలో చిక్కుకుని జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా బుధవారం జరిగిన తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ నాయకులు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై 2022లో జరిగిన దారుణ ఘటన అందరికీ తెలిసిందే. అప్పట్లో ప్రధాన కార్యాలయాన్ని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అప్పట్లో తీవ్ర వివాదానికి దారి తీసిన ఈ ఘటనపై వైసీపీ సర్కారు కేసులు నమోదు చేసింది.
కానీ, కేసు విచారణ మాత్రం ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించిం ది. కేసులో ఉన్న పెద్ద తలకాయలను అరెస్టు చేసేందుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో పోలీసులు అరెస్టులు చేసేందుకు రెడీ అయ్యారు. దీనిలో వైసీపీ కీలక నాయకులు దేవినేని అవినాష్ చౌదరి, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్ సహా పదుల సంఖ్యలో నాయకులు ఉన్నారు. మరికొందరు కార్యకర్తలు.. ఇప్పటికే అరెస్టయి.. జైళ్ళలో ఉన్నారు. ఇప్పుడు వీరిని కూడా ఏ క్షణంలో అయినా అరెస్టు చేయొచ్చనే సంకేతాలు వచ్చాయి.
ఇదిలావుంటే..తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ.. హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణల అనంతరం.. ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించింది. అంతేకాదు.. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ పరిణామల తో వీరిఅరెస్టు ఖాయమని తెలుస్తోంది. మరోవైపు.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించారన్న కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌కు కూడా.. హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ దక్కలేదు. ఈయనకు కూడా.. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో వైసీపీ అధిష్టానం అంతర్మథనంలో పడిపోయింది.
వీరందరి అరెస్టు జరిగితే.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాదిరిగా.. సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేసమయంలో పార్టీలోనూ నాయకులు అభద్రతా భావంతో గడపాల్సి ఉంటుంది. దీంతో పార్టీపైనా.. కార్యకర్తలపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ పరిణామాలతోనే జగన్ ఇప్పుడు తల పట్టుకున్నారు. కింకర్తవ్యం..? అంటూ ..న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. ఒకవైపు ప్రజలను పరామర్శించాల్సి రావడం.. మరోవైపు.. నాయకులు చిక్కుల్లో ఉండడంతో జగన్ కు ఎటు చూసినా.. ఇబ్బందులే కనిపిస్తున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.