వైసీపీ ప్రభుత్వంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంతోపాటు, ఉండవల్లిలోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఇల్లు ధ్వంసం ఘటనలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనల నేపథ్యంలో వైసీపీ నేతలు జోగి రమేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైసీపీ నేత దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే వారు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా వారికి బెయిల్ దొరకలేదు. ఈ క్రమంలోనే తాజాగా మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో సురేష్ ను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు ఆయనను విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, టీడీపీ కార్యాలయం ధ్వంసం ఘటనతోపాటు చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ను కూడా ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రమేష్ తోపాటు దేవినేని అవినాష్ కూడా అండర్ గ్రౌండ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేసుల నుండి తప్పించుకునేందుకు వారు తమ లాయర్ల ద్వారా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత తలశిల రఘురాం కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నందిగం సురేష్ అరెస్ట్ తో మిగతా వైసీపీ నేతలు కేసులకు భయపడుతున్నారని, అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను వేధింపులకు గురి చేసిన వైసీపీ నేతలను టార్గెట్ చేశారని టాక్ వస్తోంది. అయితే, చట్ట ప్రకారమే తప్పు చేసిన వైసీపీ నేతలు, అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. ఆ వైసీపీ నేతలను పరిగెత్తిస్తున్న చంద్రబాబు..అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.