మావోయిస్టు కీలక నేత ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్ కృష్ణ అలియాస్ మారన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మంగళవారం నాడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎదుట ఆయన సరెండర్ అయ్యారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లికి చెందిన మారన్న మావోయిస్ట్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఆయనపై రూ.20 లక్షల రివార్డు ఉండగా…దానిని మారన్నకే ఇచ్చేస్తామని సవాంగ్ ప్రకటించారు. మారన్నకు ఇంటి స్థలం , అవసరమైతే వ్యవసాయ భూమి స్వయం ఉపాధి కూడా కల్పిస్తామని సవాంగ్ హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకు చెందిన మావోయిస్టు లొంగిపోతే ఏపీ ఆస్తులు రివార్డుగా ఇస్తారా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ ఆఫర్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే వర్తిస్తుందా లేక అందరికీ వర్తిస్తుందా అని ఎద్దేవా చేస్తున్నారు. ఇదే కాదు, అంతకుముందు దేశంలో మావోయిస్టులే లేరంటూ కామెంట్లు చేసిన సవాంగ్ దగ్గరకు వచ్చి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మావోయిస్టు లొంగిపోవడం కామెడీగా ఉందని పంచ్ లు వేస్తున్నారు.
మారన్న లొంగుబాటు సందర్భంగా దేశంలోని మావోయిస్టులపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మావోయిజం.. అనేదే లేదని.. ఆ సిద్ధాంతాలు పూర్తిగా కనుమరుగయ్యాయని.. అయినా కొందరు దీనిని పట్టుకుని పాకులాడుతు న్నారని.. సవాంగ్ వ్యాఖ్యలు సంధించారు. మావోయిస్టులు ప్రజల్లో బలం కోల్పోయారని, ఒకప్పటికి.. ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయని.. అయినప్పటికీ.. ఇంకా మావోయిస్టులు తమ పాత సిద్ధాంతాలతోనే ఉన్నారని.. ఇప్పుడు వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు.
“మావోయిస్టులకు అంతో ఇంతో ఆశ్రయం కల్పించిన ఆదివాసీలు.. ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. వారు ప్రస్తుతం ఇల్లు గడిస్తే.. చాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఆదివాసీలకు.. రక్షణ కల్పించేలా.. వారికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.. దీంతో ఆదివాసీలు ఇప్పుడు ప్రభుత్వా లకే అనుకూలంగా ఉన్నారు. దీంతో ఎక్కడా మావోయిజం. ఆ పార్టీలు లేవు. కానీ, కొందరు `మేధావులు` మాత్రం ఇంకా రెచ్చగొడుతున్నారు. పాటలు పాడుతున్నారు. చేతిలో పెన్నుందికదా.. అని పుస్తకాలు రాస్తున్నారు. విప్లవ సాహిత్యం పేరుతో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఇకపై సాగవు“ అని సవాంగ్ అన్నారు.
ఆంధ్ర ఒరిస్సా స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు ముత్తన్నగిరి జలంధర రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారని సవాంగ్ తెలిపారు. జలంధర్ రెడ్డి అలియాస్ మారన్నపై 20 లక్షల రివార్డ్ ఉందని డీజీపీ తెలిపారు. పోలీస్ స్టేషన్లపై దాడులు చేసిన సంఘటనల్లో మారన్న పాత్ర ఉందన్నారు. ముత్తన్నగిరి జలంధర్ అలియాస్ మారన్న అలియాస్ కృష్ణ (40) కొంపల్లి, సిద్దిపేట జిల్లా, తెలంగాణకు చెందిన మావోయిస్టు అని, మెదక్ డిస్ట్రిక్ట్ కమిటీలో మొదట జాయిన్ అయ్యాడని వెల్లడించారు. ఏఓబీలో పలు దాడులు, 2008 బలివెల సంఘటనలో మారన్న సభ్యుడుగా ఉన్నాడని డీజీపీ సవాంగ్ తెలిపారు.
సున్నిపెంట, ఎర్రగొండపాలెంలో జరిగిన బాంబు పేలుళ్ళలో, విన్నికృష్ణ, మల్ఖాన్‌గిరి కలెక్టర్‌ను కిడ్నాప్ చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. ఆరు హత్యలలో నిందితుడైన మారన్న.. ప్రజా బలం లేక తాను జనజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నాడని తెలిపారు. పార్టీ గతంలో లాగా లేకపోవ డం, ఏజెన్సీ ప్రాంతాలలో పార్టీలో రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల కూడా మారాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఏఓబీలో ఎక్కువగా జరుగుతున్న పోలీస్ యాక్టివిటీస్‌తో రిక్రూట్మెంట్ లేదంటున్నాడని, ప్రభుత్వం ఇచ్చిన కొత్త లొంగుబాటు పాలసీకి ఆకర్షితుడై స్వయంగా లొంగిపోయాడని తెలిపారు. ఏపీ ప్రభుత్వం నుంచి అతను మారడానికి కావలసిన అన్ని సదుపాయాలు అందిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.
అయితే.. ఈ సందర్భంగా డీజీపీ చేసిన కామెంట్లు మాత్రం రాజకీయంగా, సామాజికంగా కూడా సంచలనం సృష్టించడం గమనార్హం. చైనాలోనే మావోయిస్టులు, మావోయిజం లేదని.. అలాంటిది ఇండియన్ మావోయిజం ఎక్కడ ఉందని ప్రశ్నించడం గమనార్హం. మొత్తానికి డీజీపీ చేసిన వ్యాఖ్యలపై సామాజిక వాదులు.. విప్లవ రచయితలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. విధాన పరమైన వ్యాఖ్యలు డీజీపీ చేయడం సమంజసం కాదని అన్నారు.