అమెరికాలో సంచలనంగా మారటమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది.. ఆఫ్రికన్ అమెరికన్ అయిన 46 ఏళ్ల జార్జ్ ఫ్లాయిడ్ మరణం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమికి కారణాల్లో జార్జ్ మరణం కూడా ఒక కారణమని విశ్లేషించేవారు లేకపోలేదు. 2020 మే 25న ఒక షాపులో నకిలీ నోట్లు సరఫరా చేసిన ఆరోపణపై జార్జ్ ప్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని.. తెల్లవాడైన పోలీసు అధికారి డెరెక్ అమానుషంగా వ్యవహరించటం.. మూర్ఖంగా..అతని మెడ మీద తన కాలిని ఒత్తిపట్టటటం.. తనకు ఊపిరి ఆడటం లేదని ఎంత గింజుకున్నా కనికరించని అతడి తీరుతో.. జార్జ్ ప్రాణం పోయింది.
అతగాడి మరణం అమెరికాను తీవ్రంగా కదిలించింది. అదెంతలా అంటే.. నిరసనకారుల ఆగ్రహపు జ్వాలలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. కొంతసేపు రహస్య బంకర్ లో ఉండాల్సిన దుస్థితి. ప్రపంచమంతా జార్జ్ మరణానికి సంఘీభావం తెలపగా.. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూకు కారణమైంది. ఈ నేపథ్యంలో జార్జి హత్యపై పోలీసు అధికారి డెక్ తోపాటు.. అతనితో ఉన్న మరో ముగ్గురు పోలీసు అధికారులపై అభియోగాలు నమోదయ్యాయి.
ప్రస్తుతం కోర్టులో ఈ హత్యపై విచారణ జరుగుతోంది. 12 మంది సభ్యులు ఉన్న జ్యారీ పది గంటల పాటు విచారించిన నేపథ్యంలో జార్జి మరణంలో దోషిగా పోలీసు అధికారి డెరెక్ ను తేల్చింది. జరిగిన దారుణాన్ని సెకండ్..థర్డ్ డిగ్రీ హత్యగా..పేర్కొంటూ తీర్పును వెలువరించింది. న్యాయస్థానం తన తీర్పును ప్రకటించే సమయంలో.. మాజీ పోలీసు అధికారి డెరెక్ ముఖానికి ముసుగు వేసి ఉంచటంతో అతని ముఖంలో హావభావాలు బయటకు కనిపించని పరిస్థితి.
కోర్టులో తీర్పు వెలువడే సమయానికి న్యాయస్థానం వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. తీర్పు అనంతరం హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే.. డెరెక్ తో పాటు జార్జి మరణించే సమయంలో అక్కడే ఉన్న ముగ్గురు పోలీసు అధికారులపైనా విచారణను ఈ ఆగస్టులో మొదలు కానుంది. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత జార్జ్ కుటుంబ సభ్యుల్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ లు వైట్ హౌస్ కు పిలిపించుకొని మాట్లాడారు.