ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న వెంకటేష్ తాజా చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
2025 సంక్రాంతికి అనిల్ రావిపూడి, వెంకీ హ్యాట్రిక్ మూవీ విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అయితే ఈ సినిమాకు `సంక్రాంతికి వస్తున్నాం` అనే విచిత్రమైన టైటిల్ ను పెడుతున్నారట. కథ పరంగా ఆ టైటిల్ సినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అనిల్-వెంకీ మూవీ కోసం సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ను ప్రొడ్యూసర్ దిల్ రాజు రిజిస్టర్ చేయించారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, అనిల్-వెంకీ మూవీ జూలై నెలలో సెట్స్ మీదకు వెళ్లింది. హీరో, అతని ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్, అతని ఎక్స్లెంట్ వైఫ్.. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎక్స్ట్రార్డినరీ ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో హీరోగా వెంకీ, అతని గర్ల్‌ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి, వైఫ్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.