ముంబై సినీ నటి జత్వాని కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఆమెను పోలీసుల అండతో కిడ్నాప్ చేయడం, బెదిరించడం వంటి చర్యలకు వైసీపీ నేతలు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ కేసులో పోలీసులు దూకుడు పెంచారు.
ఆ కేసు ప్రత్యేక అధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్ ను సీపీ రాజశేఖర్ బాబు నియమించారు. తనకు జరిగిన అన్యాయంపై ఆన్లైన్లో సీపీ రాజశేఖర్ కు జత్వానీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు అందగానే విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రత్యేక అధికారి బృందం రేపు ముంబై వెళ్లనుంది. ఏది ఏమైనా ఈ కేసులో సజ్జలతోపాటు మరికొందరు పోలీసు అధికారుల పేర్లు వినిపించడం సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల పాత్ర ఉంటే వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించిన సంగతి తెలిసిందే.